Narendra Modi App Sends User Data To USA Companyకేంద్రం అందిస్తున్న ప్రభుత్వ పథకాల సమాచారాన్ని ప్రజలతో పంచుకోవాలని, తానేం చేస్తున్నానన్న విషయాన్ని ప్రజలకు నిత్యమూ తెలియజేయాలన్న ఉద్దేశంతో 2015 జూన్ లో ‘నమో’ యాప్ ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఆపై సందర్భం వచ్చి ప్రతి సారీ ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. అందుకు తగ్గట్లుగా గూగుల్ ప్లే నుంచి 50 లక్షల మందికి పైగా స్మార్ట్ ఫోన్ యూజర్లు ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు.

ఇక ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్న యువత, విద్యార్థుల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తున్నారని ఇటీవల ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో యాప్ డౌన్ లోడ్ చేసుకున్న తరువాత దాన్ని ఇన్ స్టాల్ చేస్తే, ఎన్నో రకాల అనుమతులను అడుగుతోంది. సాధారణంగా ఏ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నా, మెసేజ్ లు, కాంటాక్ట్ లిస్ట్ తదితరాలను యాక్సెస్ చేస్తుందన్న సంగతి తెలిసిందే. నమో యాప్ ఏకంగా 22 అంశాల్లో పర్మిషన్ అడుగుతుండటం గమనార్హం.

యూజర్ ఉండే లోకేషన్, అతని సెల్ ఫోన్ మెమొరీలోని ఫోటోలు, కాంటాక్ట్స్, కెమెరా, మైక్రోఫోన్ వంటి సమస్త అంశాలపైనా యాక్సెస్ తీసుకుంటుంది. స్మార్ట్ ఫోన్ మెమొరీ కార్డులో ఉన్న సమాచారంపైనా అనుమతి అడుగుతుండటం గమనార్హం. ‘నమో’ యాప్ ఇన్ స్టాల్ సమయంలో అన్ని అనుమతులు ఇవ్వడం తప్పనిసరేమీ కాదని కొందరు చెబుతున్నా, అనుమతి ఇచ్చినా, ఇవ్వకున్నా ఫోన్ లోని డేటా మొత్తాన్నీ పరిశీలించే అవకాశం దానికి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఇండియాలో యూత్ ఆలోచన ఏ దిశగా ఉంది? వారేమి కోరుతున్నారు? తదుపరి ఎన్నికల్లో విజయానికి ఎటువంటి ఎత్తులు వేయాలన్న విషయాలను ఈ యాప్ అందించే సమాచారం ద్వారా నరేంద్ర మోడీ విశ్లేషిస్తున్నట్టు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇక ఈ యాప్ వాడటం డేజరని, యూజర్ సమస్త సమాచారాన్ని ఇది థర్డ్ పార్టీకి అందిస్తోందని ఫ్రాన్స్‌కు చెందిన సైబర్‌ భద్రతా పరిశోధకుడు ఇలియట్‌ ఆల్డర్‌ సన్‌ ట్వీట్లలో ఆరోపించిన సంగతి తెలిసిందే.