Narendra Modi Andhra Pradesh Visitతెలుగుదేశం పార్టీ ఎన్డీయే ప్రభుత్వం నుండి బయటకు వచ్చాకా మొట్టమొదటి సారి ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. జనవరిలోనే ఈ పర్యటన జరగాల్సి ఉండగా అది చివరి నిముషంలో వాయిదా పడింది. ఇప్పుడు ఇదే నెలలో రెండు సార్లు ఆంధ్రప్రదేశ్ కు రాబోతున్నారు మోడీ. 10న గుంటూరుకు, 16న విశాఖపట్నం రాబోతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పుడు తాజాగా విశాఖపట్నం టూర్ ఇదే నెల 27కు వాయిదా పడింది. ఏది ఏమైనా మోడీ ఇదే నెలలో రెండు సార్లు ఏపీకి రాబోతున్నారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ వ్యతిరేక గాలి వీస్తుంది. రాష్ట్రంలోని ఏ పార్టీ కూడా ఆ పార్టీతో ఎన్నికల ముందు పొత్తు పెట్టుకునే అవకాశం కనిపించడం లేదు. దీనితో అసెంబ్లీలోనూ, పార్లమెంట్ సీట్లలోనూ ఆ పార్టీ ఖాతా ఓపెన్ చేసే అవకాశం కనిపించడం లేదు. దీనితో రాష్ట్ర బీజేపీ నాయకులంతా మోడీ వేవ్ మీదే మొత్తం ఆశలు పెట్టుకున్నారు. అయితే మోడీ ఆంధ్రప్రదేశ్ కు ఏమైనా స్పెషల్ ప్యాకేజీ ప్రకటిస్తారేమో అని వారు ఆసక్తికరంగా వేచి చూస్తున్నారు. అయితే దీని వల్ల పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇప్పటికే కేంద్రంలో చివరి బడ్జెట్ ప్రవేశపెట్టేసింది మోడీ ప్రభుత్వం. ఇప్పుడు ప్రకటించేవి ఏమైనా ఎన్నికల హామీ వంటిదే. 2014 ఎన్నికల ప్రచారం టైమ్ లోని అనుభవాల దృష్ట్యా ప్రజలు ఇటువంటివి నమ్మే అవకాశం చాలా తక్కువ. ఏమైనా ప్రకటన చేసినా అది చంద్రబాబు నాయుడు పెట్టిన ఒత్తిడి వల్లే ప్రకటించాల్సి వచ్చిందని ప్రజలు అనుకుంటారు దీనితో బీజేపీకి పెద్దగా ఉపయోగం ఉండదు. దీనితో అసలు అటువంటి ప్రకటన ఏమీ చెయ్యకుండానే మోడీ తేల్చేయొచ్చు.

ఎప్పటిలానే రాష్ట్రానికి చాలా చేసేశాం, ఎవరు చెయ్యనంత చేసేశాం, చంద్రబాబు మాత్రం అదంతా అవినీతి చేసేసి తినేశారు అంటూ రొటీన్ విమర్శలే చేస్తారు. ఎన్ని ఇచ్చాము అని చెప్పుకున్నా చివరికి స్పెషల్ స్టేటస్ ఎందుకు ఇవ్వలేదనే దాని దగ్గరే ఆగుతుంది. దీనివల్ల బీజేపీ భాగ్యరేఖలు మారే అవకాశం అయితే లేదు. 2019 ఎన్నికల వరకు బీజేపీ అవసరమైతే వైఎస్సాఆర్ కాంగ్రెస్, తెరాస అత్యధిక సీట్లు గెలుచుకుని అవసరమైతే తరువాత మద్దతు ఇస్తారని మాత్రమే మోడీ – అమిత్ షా ఆశగా ఉన్నారు. కాకపోతే పార్టీని ఈ స్థాయికి తెచ్చినందుకు వారిద్దరూ వారినే నిందించుకోవాల్సిన పరిస్థితి.