Narendra Modi Andhra Pradesh Tour cancelledరాష్ట్ర రాజకీయాలను గత కొద్ది రోజులుగా కుదిపేస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. ప్రధాని జనవరి 6న కేరళ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో పర్యటించాలన్నది తొలుత ప్రణాళిక. కేరళ భాజపా వర్గాలు నిర్ణయించిన ప్రకారం తిరువనంతపురంలో జరిగే బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం మోదీ మధ్యాహ్నం నుంచి ఏపీ పర్యటనకు బయలుదేరాల్సి ఉంది. అందుకు అనుగుణంగా గుంటూరు నగరంలో బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.

అయితే కేరళ లో ఉన్న రాజకీయ పరిస్థితుల కారణంగా సభా వేదికను తిరువనంతపురంలో కాకుండా శబరిమలై సమీపంలోని ‘పట్టణంతిట్ట’కు మార్చాలని కేరళ భాజపా వర్గాలు పార్టీ అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్నాయి. అయితే అదే జరిగితే ప్రధాని సకాలంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకోలేరని, జనవరి 6న గుంటూరులో జరగాల్సిన సభ వాయిదా పడక తప్పదని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై ఈరోజు చివరికి ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగా వాయిదాపై అధికారిక ప్రకటన వెలువడుతుందని తెలిపారు.

మరోవైపు పార్టీ జాతీయ కౌన్సిల్‌ సమావేశాలు జనవరి 12, 13తేదీలలో దిల్లీలో నిర్వహించాలని భాజపా తొలుత నిర్ణయించింది. సంక్రాంతి పండుగ దృష్ట్యా ఈ సమావేశాలను ముందుకు జరపాలనే తర్జనభర్జనలు పార్టీలో సాగుతున్నాయి. దీనివల్ల కూడా సభ వాయిదాకు దారితీయవచ్చునని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ఈ వాయిదా వార్తతో బీజేపీ శ్రేణులలో నిరాశ ఆవహించింది. టీడీపీ ఎన్డీయే నుండి బయటకు వచ్చాకా ప్రధాని ఏపీ రావడం ఇదే తొలి సారి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ ఛార్జ్ తీసుకున్నాకా ఇదే ప్రధాని తొలి పర్యటన కావడంతో ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

ప్రధాని వచ్చి తమ పార్టీ భాగ్యరేఖలు మారుస్తారని బీజేపీ శ్రేణులు భావించాయి. ఒక సారి గనుక పోస్టుపోన్ అయితే శ్రేణులలో మళ్ళీ ఆ జోష్ తీసుకురావడం కష్టమని రాష్ట్ర పార్టీ నాయకత్వం భావిస్తుంది. ప్రధాని పర్యటన దృష్ట్యా టీడీపీ ప్రభుత్వం అనేక నిరసన కార్యక్రమాలు ప్లాన్ చేసుకుంది. స్వయంగా ముఖ్యమంత్రి నిరసన పాదయాత్ర చేయ్యడానికి నిర్ణయించారు. ఇప్పటికే ఏ మొహం పెట్టుకుని వస్తున్నారు? మేము చచ్చామో బ్రతికామో చూడటానికి వస్తున్నారా అంటూ చంద్రబాబు నాయుడు మోడీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.