Narendra Modi - Amit Shahరెండో సారి అధికారంలోకి వచ్చిన నాటి నుండి మోడీ – అమిత్ షా తన పూర్తి దృష్టి బీజేపీని దేశమంతా వ్యాపించడం మీదే పెట్టారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడుని ఇంటికి పంపిన వారు తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు కర్ణాటకలోని కాంగ్రెస్ – జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చడానికి పావులు కదుపుతున్నారు కమలనాధులు. రెండు వైపులా వారు ఇప్పటికే క్యాంపు రాజకీయాలకు తెర తీశారు. కుమారస్వామి ప్రభుత్వానికి నూకలు చెల్లిపోయాయి అనే అనుకుంటున్నారు.

కర్ణాటక తరువాత మధ్య ప్రదేశ్ మీద దృష్టి పెట్టబోతున్నారట. కాంగ్రెస్ అక్కడ అతికష్టం మీద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 114 మంది ఉండగా,పూర్తి మెజార్టీకి 115 మంది అవసరం. బిఎస్పి నుంచి ఇద్దరు, ఎస్పి ఒకరు, ముగ్గురు ఇండిపెండంట్ల మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతోంది. కాగా బిజెపికి 109 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలను కాంగ్రెస్ నుండి దూరం చేసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలని చూస్తుంది.

చూస్తుంటే భారతదేశం మీద మోడీ – అమిత్ షా అశ్వమేధయాగం చేస్తున్నట్టుగా ఉంది. అశ్వమేధయాగంలో యాగం చేసిన వారు ఒక అశ్వాన్ని వదులుతారు. అది వెళ్ళినంత మేర ఆ రాజ్యమంతా ఆ అశ్వం యజమాని సామంత రాజ్యం అవుతుంది. ఎదిరించిన వారిని యుద్ధంలో ఓడిస్తారు. గతంలో త్రేతాయుగంలో రాముడు కూడా ఇదే యాగం చేశారు. ప్రజాస్వామ్యంలో సరికొత్త అశ్వమేధయాగం మొదలు పెట్టారు మోడీ – అమిత్ షా. పైగా వారే ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి నీతులు చెబుతారు.