Modi-Amit-Shah-జమ్మూకాశ్మీర్ సమస్య పరిష్కారానికి తొలి అడుగు అని చెబుతూ ఆర్టికల్ 370ని సాగనంపింది బీజేపీ ప్రభుత్వం. జమ్ము, కశ్మీర్‌, లద్దాక్‌ ప్రాంతాలను విడదీశారు. వీటిల్లో జమ్ము, కశ్మీర్‌లు అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతాలుకాగా.. లద్దాక్‌ అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించారు. అయితే ఈ చర్య ఏదో నిన్నో మొన్న తీసుకుని చేసింది కాదు. 2018 జూన్‌లో పీడీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడే కమలనాథులు దీనికి వ్యూహం రచించారు. కాశ్మీర్ విషయంలో ఏ మార్పు చెయ్యాలన్న భారత పార్లమెంట్ కు ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం అవసరం.

అక్కడి ప్రభుత్వాలు వాటిని జరగనిచ్చేవి కావు. దానిని బైపాస్ చేసేందుకు 2018 జూన్ లో ప్రభుత్వం నుండి బీజేపీ తప్పుకుని, రాష్ట్ర అసెంబ్లీల అధికారాన్ని గవర్నర్ చేతిలో పెట్టింది. పీడీపీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌లు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సమాయత్తవుతున్న తరుణంలో 2018 డిసెంబర్‌లో వివాదాస్పదంగా రాష్ట్రపతి పాలన విధించింది. 2019 మేలో సాధారణ ఎన్నికలతో పాటు జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు జరపాల్సి ఉన్నా, ఎన్నికల కమిషన్ ద్వారా వాటిని జరగకుండా చూసింది.

అనుకూలమైన గవర్నర్ ద్వారా ఆర్టికల్ 370ని సాగనంపింది. రాష్ట్రపతి పాలన కావడంతో శాంతిభద్రతలు పూర్తిగా కేంద్రం ఆధీనంలోకి తెచ్చుకుంది. అలా పగడబంధీగా తాము అనుకున్నది చేశారు… మోడీ… అమిత్ షా. ఈ చర్యను దేశవ్యాప్తంగా ప్రజలు ఆహ్వానిస్తున్నారు అయితే దీని తరువాత పర్యవసానాలు ఎలా ఉంటాయి అనేది చూడాలి. ఇది ఏ రకమైన పరిస్థితులకు దారి తీసినా కాశ్మీర్ సమస్య పరిష్కారానికి ఎవరు చెయ్యని సాహసానికి మోడీ – అమిత్ షా పూనుకున్నారని చరిత్రలో లిఖితం అవుతుంది.