Narendra-Modi-Amit-shahజమ్ము కశ్మీర్‌కు సంబంధించి నరేంద్ర మోడీ ప్రభుత్వం పలు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంది. జమ్ము కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కలిపించే ఆర్టికల్‌ 370ను రద్దు , 35(ఏ) రద్దు , రాష్ట్ర విభజన అంశాలు ఏకకాలంలో రాజ్యసభలో ప్రవేశపెట్టారు. అలాగే జమ్ము, కశ్మీర్‌, లద్దాక్‌ ప్రాంతాలను విడదీశారు. వీటిల్లో జమ్ము, కశ్మీర్‌లు అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతాలుకాగా.. లద్దాక్‌ అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రాజ్యసభలో కాసేపటి క్రితం ఈ ప్రకటన చేశారు.

దీంతో ప్రతిపక్షాలు ఒక్కసారిగా ఆందోళనకు దిగాయి. గందరగోళం మధ్య కొద్దిసేపు రాజ్యసభ టీవీ ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేశారు. అంతకు ముందే కాశ్మీర్ లోని సమస్యాత్మక ప్రాంతాలను కేంద్ర బలగాలు, సైన్యం తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఆ రాష్ట్ర మాజీ సీఎంలు ఒమర్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలతో పాటు పలు రాజకీయ పార్టీల ముఖ్య నేతలను గృహనిర్బంధం చేశారు. ఇది ఇలా ఉండగా దేశవ్యాప్తంగా ప్రజలు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అభినందిస్తున్నారు.

అయితే కొందరు నిపుణులు మాత్రం దీని పై తమ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. “ఆర్టికల్‌ 370ను రద్దు , 35(ఏ) కలిపించడం వల్లే జమ్మూ కాశ్మీర్ భారత్ లో అంతర్భాగం కావడానికి ఒప్పుకుంది. ఇప్పుడు వాటిని తీసి వేస్తే, అసలు మేము భారత్ తో ఎందుకు కలిసి ఉండాలి అనే ప్రశ్న తెర మీదకు తేవచ్చు,” అని వారు అభిప్రాయపడుతున్నారు. ఇది నోట్లరద్దు తరహాలో బెడిసికొడుతుందో, లేక గత కొన్ని దశాబ్దాలుగా ఎవరూ పరిష్కరించలేకపోయిన కాశ్మీర్ సమస్యకు పరిష్కారం చూపిస్తుందో..? అయితే సమస్య పరిష్కారం దిశగా తొలి అడుగు తీసుకున్న మోడీ ప్రభుత్వాన్ని ప్రశంసించాలి.