Naredra Modi Telangana campaign failsచూడబోతే రెండు తెలుగు రాష్ట్రాలలో బీజేపీ పరిస్థితి ఏమంత బాగున్నట్టు లేదు. ఏపీ, తెలంగాణాలో పూర్తి నిస్తేజంగా ఉన్న రాష్ట్ర యూనిట్లు ప్రధాని నరేంద్ర మోడీ వేవ్ మీదే తమ ఆశలు పెట్టుకున్నాయి. ఎలాగోలా బోణి కొట్టాలన్న వారి తాపత్రయానికి ఆదిలోనే అపశకునం ఎదురయ్యింది. ఈరోజు మహబూబ్ నగర్ లో తొలి ఎన్నికల సభలో ప్రసంగించిన మోడీకి మైక్ సమస్య వచ్చింది. అలాగే వీడియో సమస్య వచ్చింది. సహజంగా ప్రధాని స్థాయి వ్యక్తుల మీటింగుకి ఇటువంటి సమస్యలు ఉండవు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతున్నప్పుడు కూడా ఇలాంటి సమస్య వచ్చింది.ఆ తర్వాత మోడీ మాట్లాడడం ఆరంభించిన కొద్ది నిమిషాలకే ఆడియో సరిగా వినిపించలేదు. ఒకటి, రెండుసార్లు వీడియో కూడా కనిపించలేదు. మొదట అనువాదం లేకుండా హిందీ ప్రసంగం కొనసాగించారు. కాని ఆశించిన స్పందన లేకపోవడమో, జనానికి అర్దం కావడం లేదనుకున్నారేమో కాని, అధ్యక్షుడు లక్ష్మణ్ ను అనువాదం చేయాల్సిందిగా సూచించారు. సాయంత్రం ఆంధ్రప్రదేశ్ వెళ్లి కర్నూల్ లో ప్రసంగించనున్నారు ఆయన.

రెండు తెలుగు రాష్ట్రాలలోని 42 పార్లమెంట్ సీట్లలో 2014 ఎన్నికలప్పుడు మూడు సీట్లు గెలుచుకుంది బీజేపీ. అది తెలుగుదేశం పార్టీ పొత్తుతో అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సారి ఆ పార్టీ ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేస్తుంది. కనీసం ఖాతా తెరవడం మాట దేవుడెరుగు కనీసం డిపాజిట్లు అయినా వస్తాయా అనేది చూడాలి. ఏపీలోని రాజంపేటలో బీజేపీ అభ్యర్థి తన నామినేషన్ విరమించుకోవడం విశేషం. మోడీ అయినా బీజేపీ భాగ్యరేఖలు మార్చగలరేమో చూడాలి.