narayana swamy about mla prasanna kumar reddyఈరోజు నెల్లూరు జిల్లా సంగం మండలంలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, వైసీపీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆత్మకూరు ఉపఎన్నికలో తమ పార్టీ అభ్యర్ధి విక్రమ్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ప్రసన్నకుమార్ రెడ్డి మొహం మీదనే మా ఎమ్మెల్యే చెప్పింది సరికాదంటూ నారాయణ స్వామి చెప్పడంతో ఆయన చిన్న బుచ్చుకొన్నారు.

ఎన్నికల ప్రచారంలో ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఓ ఎమ్మెల్యే చనిపోయినప్పుడు వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులను పోటీ చేస్తున్నట్లయితే, వారిపై పోటీగా అభ్యర్ధిని నిలబెట్టరాదనే మంచి ఆనవాయితీకి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కట్టుబడి ఉన్నందుకు ఆయనకు అభినందనలు తెలుపుతున్నాను,” అని చెపుతుంటే నారాయణ స్వామి ఆయన చేతిలో మైక్ లాక్కొని, “మా ఎమ్మెల్యే చెప్పినదాంతో నేను ఏకీభవించడం లేదు. ఈ ఉపఎన్నికలో టిడిపి పోటీ చేయనప్పటికీ మా అభ్యర్ధిని ఓడించేందుకు చంద్రబాబు నాయుడు తెర వెనుక అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసిన ఈసారి విక్రమ్ రెడ్డి కనీసం లక్ష ఓట్ల భారీ మెజార్టీతో ఈ ఉపఎన్నికలో విజయం సాధించబోతున్నారు,” అని అన్నారు.

ఆత్మకూరు ఉపఎన్నికలో టిడిపి పోటీ చేసి ఉంటే వైసీపీ విమర్శించినా అర్ధం ఉండేది. కానీ పోటీ పెట్టకుండా వైసీపీ అభ్యర్ధి విజయానికి పరోక్షంగా సహాయపడుతున్నప్పటికీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఈవిదంగా విమర్శించడం, తమ పార్టీ ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడుని బహిరంగంగా మెచ్చుకొంటుంటే సహించలేకపోవడం విస్మయం కలిగిస్తుంది.

ఒకవేళ ఈ ఉపఎన్నికలో టిడిపి అభ్యర్ధిని నిలబెట్టి ఉంటే వైసీపీకి గట్టి పోటీ ఎదురయ్యేదని కానీ టిడిపి దూరంగా ఉన్నందున, బిజెపిని చావు దెబ్బ తీయబోతున్నామని మంత్రి అంబటి రాంబాబు స్వయంగా ఈరోజు చెప్పారు.