Narayana Educational Institutions Chairman Ponguru-Narayanaమాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయణని కొద్ది సేపటి క్రితం ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. ఈరోజు ఉదయం ఏపీ సీఐడీ పోలీసులు నగరంలో కొండాపూర్‌లోని ఆయన నివాసానికి వెళ్ళి పదో క్లాస్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో అరెస్ట్ చేస్తున్నట్లు తెలిపి తమ వెంట తీసుకువెళ్ళారు.

చిత్తూరు జిల్లాలో నారాయణ స్కూల్‌ నుంచి పదో తరగతి ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని సిఎం జగన్మోహన్ రెడ్డి తిరుపతి సభలో చెప్పడం, ఇప్పుడు పోలీసులు ఆయనను అరెస్ట్ చేయడం చూస్తే ఈ వ్యవహారంలో ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకొనేందుకు ఆయనను బలిపశువుని చేస్తున్నట్లు కనిపిస్తోంది.

ఏపీలో వరుసగా జరుగుతున్న హత్యలు, అత్యాచారాలకు టిడిపి, దాని అనుకూల మీడియా సంస్థలే స్క్రిప్ట్, డైరెక్షన్, యాక్షన్ చేస్తున్నాయంటూ ఆ నేరాలను టిడిపి పద్దులో వేసేసిన వైసీపీ ప్రభుత్వం, పదో తరగతి ప్రశ్నా పత్రాల లీకేజీలను కూడా టిడిపి పద్దులో వేసేసి ఈ అపవాదు నుంచి బయటపడాలని ఆలోచిస్తున్నట్లుంది.

వైసీపీ మనసాక్షి మీడియాలో ‘ఏపీ సీఐడీ అదుపులో మాజీ మంత్రి నారాయణ’ అంటూ పెట్టి ఆయన ఫోటో వేసి మళ్ళీ దానిలో ‘టిడిపి నేత అరెస్ట్’ అని పేర్కొనడం చూస్తే ఈ వాదన నిజమని అర్దమవుతుంది.

ఆ వార్తలో ఆయన కొండాపూర్‌లో తన నివాసంలోనే ఉన్నారని, పోలీసులు అక్కడి నుంచే ఆయనను అదుపులోకి తీసుకొన్నారని చెప్పినప్పుడు ఆయన గత నాలుగు రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్ళి, ఫోన్‌ స్వీచ్చాఫ్ చేసుకొని ఉన్నారని వ్రాయడం లేకిరాతలు కాకపోతే ఏమిటి?

నారాయణ, చైతన్య విద్యా సంస్థలు టిడిపి హయాంలో పుట్టినవి కావు. ఎన్నో ఏళ్ళుగా ఉన్నవే. రెండు తెలుగు రాష్ట్రాలతో సహా పలు రాష్ట్రాలలో విస్తరించి ఉన్న ఆ రెండు సంస్థలు పదో తరగతి, ఇంటర్ పరీక్షలు ఎంతో కాలంగా చాలా సమర్ధంగా నిర్వహిస్తూనే ఉన్నాయి. కానీ ఏనాడూ వాటి నుంచి ప్రశ్నాపత్రాలు లీక్ అయిన దాఖలాలు లేవు. ఒకవేళ లీక్ చేస్తున్నట్లయితే ఎప్పుడో మూతపడి ఉండేవి. లక్షలాది మంది విద్యార్దులను తయారుచేసి రాష్ట్రానికి, దేశానికి అందించిన నారాయణ వంటి గొప్ప విద్యావేత్తను పోలీసులు అరెస్ట్ చేయడం చాలా దిగ్బ్రాంతి కలిగిస్తుంది.

అయితే మాస్ కాపీయింగ్‌ల వ్యవహారంలో కృష్ణా, ఏలూరు జిల్లాలలో ప్రభుత్వోపాధ్యాయులు, సిబ్బందే అరెస్ట్ అయిన సంగతి ప్రజలందరికీ తెలుసు. మరి దానికి కూడా టిడిపి, నారాయణ విద్యాసంస్థలే కారణమని చెప్పగలరా?