nara lokesh yuvagalam padayatra“నాలుగేళ్ల క్రితం అదో ఇనుపముక్క… భగభగమని మండే రాజకీయ కొలిమిలో సలసల మరుగుతూ ఎర్రబడి ఎన్నో సుత్తిదెబ్బలు భరిస్తూ పదునుతేరి ఖడ్గంగా మారి బయటకి వచ్చింది. ఆ ఖడ్గమే నారా లోకేష్‌! మూడున్నరేళ్ళుగా నిరంకుశపాలనను మౌనంగా భరిస్తున్న ప్రజల గళమై యువగళమై ప్రతిధన్వించేందుకు సిద్దమైంది.

కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు తన కోసం ఎదురుచూసేవారున్నారు. పరితపించేవారున్నారు. తన కోసమే అడుగడుగునా ముళ్ళు,రాళ్ళు పేర్చేవారు కూడా ఉన్నారని నారా లోకేష్‌కి తెలుసు. ఘనమైన చరిత్ర కలిగి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి పట్టిన సకల దరిద్రాలు వదిలించాలంటే ప్రజల దీవెనలతో పాటు వైసీపీ వేయబోయే ఆ ముళ్ళు, రాళ్ళని కూడా భరించక తప్పదని తెలుసు.

అందుకే నారా లోకేష్‌ నేడు కుప్పం నుంచి 4,000 కిమీ పాదయాత్రకి తొలి అడుగు వేసి ప్రారంభించారు. రాష్ట్రంలో 125 నియోజకవర్గాల గుండా 400 రోజుల పాటు సాగే నారా లోకేష్‌ పాదయాత్రతో వైసీపీ పీఠాలు కదిలిపోతాయనే భయం ఆ పార్టీ నేతల్లో ఉంది. కనుక అడుగడుగునా అవరోదాలు సృష్టించడం ఖాయమే. అయితే అవే వైసీపీ పాలిట శాపాలుగా మారి పాదయాత్ర ముగిసేసరికి శిశుపాలుడి కధలా ముగియవచ్చు.

నారా లోకేష్‌ టిడిపిని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ఈ పాదయాత్ర చేస్తున్నట్లు అందరూ చెప్పుకొంటున్న మాట! కానీ అంతకంటే ముఖ్యంగా నానాటికీ శిధిలమైపోతున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసమే ఈ పాదయాత్ర అని చెప్పక తప్పదు.

నిజానికి వైసీపీ ప్రభుత్వం అమరావతి, పోలవరం పనులు కొనసాగిస్తూ, రాష్ట్రానికి పరిశ్రమలని, ఐ‌టి కంపెనీలని రప్పిస్తూ నిరుద్యోగయువతకి ఉద్యోగాలు కల్పిస్తుంటే నేడు నారా లోకేష్‌ పాదయాత్ర చేయవలసిన అవసరమే ఉండేది కాదు. ఒకవేళ చేసినా ఇంత ప్రాధాన్యం లభించి ఉండేది కాదేమో?

కానీ సంక్షేమ పధకాలనే అభివృద్ధిగా అభివర్ణిస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేస్తూ, రాష్ట్రాన్ని మూడు రాజధానులని విశాఖ రాష్ట్రమంటూ మళ్ళీ ముక్కలు చెక్కలు చేయాలని ప్రభుత్వమే ప్రయత్నిస్తుండటం, మరోపక్క పోలీస్ కేసులు, జీవోలనే ఉక్కుపాదంతో ప్రతిపక్షాలని అణచివేయాలని ప్రయత్నిస్తుండటంతో నారా లోకేష్‌ పాదయాత్ర చారిత్రిక అవసరంగా మారింది.

నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర ప్రతీ జిల్లాగుండా సాగుతుంది కనుక తప్పకుండా స్థానిక సమస్యలపై ప్రజల గళమై వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీయడం ఖాయం. వైసీపీ వేధింపులకి, కక్ష సాధింపులతో అల్లాడిపోయి వేసారిపోతున్న రాష్ట్రంలోని ప్రతీ కార్యకర్తకి నారా లోకేష్‌ పాదయాత్ర ఓ టానిక్కులా పనిచేస్తుంది. సుత్తిదెబ్బలు తిని పదునుతేరిన ఖడ్గంలా మారిన నారా లోకేష్‌ ఇంతకాలంగా తనతో ఆడుకొన్నవారితోనే పవర్ గేమ్ ఆడేందుకు వస్తున్నారు. మరి వైసీపీ కూడా రెడీయేనా?