Nara Lokesh Counter to Jaganటిడిపి యువనేత నారా లోకేష్‌ శనివారం అన్నమయ్య జిల్లాలోని తంబళ్ళపల్లి నియోజకవర్గంలో 41వ రోజు యువగళం పాదయాత్ర చేస్తున్నారు.

శుక్రవారం మదనపల్లె నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు దారిలో దేవతానగర్ వద్ద మూతబడి ఉన్న అన్నా క్యాంటీన్‌ని చూసి నారా లోకేష్‌ కాస్త భావోద్వేగానికి గురయ్యారు. అక్కడ ఆగి దాని వద్ద సెల్ఫీ తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తమిళనాడులో జయలలిత హయాంలో ప్రారంభించిన అమ్మా క్యాంటీన్లను తర్వాత అధికారంలోకి వచ్చిన స్టాలిన్ ప్రభుత్వం యదాప్రకారం కొనసాగిస్తుండగా, ఏపీలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లటినీ మూయించివేసి పైశాచిక ఆనందం పొందారని నారా లోకేష్‌ ఆరోపించారు.

నారా లోకేష్‌ కురబలకోట వద్ద ప్రజలను ఉద్దేశ్యించి ప్రసంగిస్తూ, “నేను యువగళం పాదయాత్ర చేస్తానని ప్రకటించిన రోజు, సిఎం జగన్మోహన్ రెడ్డి “నేను సింహంలా సింగిల్‌గా వస్తాను… ప్రతిపక్షాలు ఎంతమంది కలిసివస్తారో రండి. ఎంతమంది కలిసి వచ్చినా ఎవరూ నా వెంట్రుక కూడా పీకలేరని అన్నారు. కానీ నా పాదయాత్రలో మహిళలు, రైతులు, విద్యార్థులు, కార్మికులు, మైనార్టీలు, బడుగు బలహీనవర్గాల ప్రజల నుంచి నాకు వస్తున్న ఆదరణ చూసి, ఇప్పుడు ఒంటరిగా పోటీ చేయాలని జగన్మోహన్ రెడ్డి వేడుకొంటున్నారు. నేను సింహాన్ని అని గర్జించిన సిఎం జగన్ రెడ్డి నా 40 రోజుల పాదయాత్రకే ఇంత భయపడిపోతే ఎలా?ఇంకా ముందుంది ముసళ్ళ పండుగ… దానిని చూడరా?” అంటూ ఎద్దేవా చేశారు.

దారిలో మరోచోట ప్రజలని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “యస్! మన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నంబర్: 1 స్థానంలో ఉంది కానీ దేనిలోనంటే… అప్పులలో మనం నంబర్: 1, అవినీతిలో మన రాష్ట్రం నంబర్: 1, నిరుద్యోగంలో నంబర్: 1, పెట్రోలు, డీజిల్, నిత్యావసరకుల ధరలలో నంబర్: 1లో ఉన్నాము. చంద్రబాబు నాయుడు హయాంలో పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాల కల్పనలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నంబర్: 1 స్థానంలో ఉండేది కానీ ఇప్పుడు విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు, ఇంటి పన్ను, చివరికి చెత్తపన్నులో కూడా మన రాష్ట్రం నంబర్: 1 స్థానంలో ఉంది,” అని ఎద్దేవా చేశారు.

సోమవారం రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగబోతున్నాయి. కనుక శనివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం 5 గంటలకి పోలింగ్ ముగిసేవరకు ఎటువంటి రాజకీయ కార్యక్రమాలు నిర్వహించకూడదు. కనుక శనివారం సాయంత్రం 5 గంటలకు నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర నిలిపివేస్తారు. మళ్ళీ మంగళవారం ఉదయం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. ఈ రెండు రోజులు కురబలకోట క్యాంప్ సైట్ వద్ద తన కార్వాన్‌లోనే జిల్లా టిడిపి నేతలతో పార్టీ పరిస్థితి, పాదయాత్రలో ప్రస్తావించాల్సిన అంశాలు, చేరికల గురించి చర్చిస్తారు.