nara lokesh padayatraటిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ ‘యువగళం పాదయాత్ర’ నేటి నుంచే ప్రారంభించబోతున్నారు. ఈరోజు ఉదయం కుప్పంలోని వరదరాజాస్వామివారి ఆలయంలో ప్రత్యేకపూజలు చేసిన తర్వాత 11.03 గంటలకి 400 రోజుల పాటు 4,000 కిమీ సాగే పాదయాత్రకి తొలి అడుగు వేయబోతున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి కుప్పంలో కమతమూరు రోడ్డు వద్ద భారీ బహిరంగసభ నిర్వహించబోతున్నారు. నారా లోకేష్‌ పాదయాత్ర ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టిడిపి నేతలు, కార్యకర్తలు సమరోత్సాహంతో ఉన్నారు.

నారా లోకేష్‌ పాదయాత్రకి పోలీసులు అనేక ఆంక్షలు విధించినప్పటికీ ఆయనతో కలిసి నడిచేందుకు వేలాదిగా కార్యకర్తలు కుప్పం తరలివస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు, అనంతపురం జిల్లాల నుంచి భారీగా కార్యకర్తలు తరలివస్తున్నారు. ఈరోజు కుప్పంలో జరిగే బహిరంగసభకి కుప్పం నియోజకవర్గం టిడిపి ఇన్‌ఛార్జ్‌ పిఎస్ ముణిరత్నం, చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌ పులివర్తి నాని తదితరులు భారీగా ఏర్పాట్లు చేశారు.

ఈ యువగళం పాదయాత్ర ప్రారంభ సభకి చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ దంపతులు, వారి కుటుంబ సభ్యులు కూడా హాజరుకాబోతున్నారు. ఏపీ టిడిపి అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడుతో సహా పలువురు రాష్ట్ర టిడిపి నేతలు ఈ సభకి హాజరుకాబోతున్నారు. మొదటి మూడు రోజులు కుప్పం నియోజకవర్గంలోనే నారా లోకేష్‌ పాదయాత్ర సాగుతుంది. దీని కోసం జిల్లా టిడిపి నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు.