nara lokesh yuvagalam padayatraటిడిపి యువనేత నారా లోకేష్‌ యువగళం పాదయాత్రలో శుక్రవారం మరో మైలురాయి 900 కిమీని అధిగమించారు. రాయలసీమ ఎండలకు బండరాళ్ళు సైతం పగిలిపోతుంటాయి. ఇటువంటి మండుటెండల్లో కూడా నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర కొనసాగిస్తుండటం చూసి వైసీపీ నేతలు కూడా ఆశ్చర్యపోతున్నారు.

ఆ పాదయాత్ర కూడా ఏదో మొక్కుబడిగా చేసుకుపోకుండా దారిలో ప్రతీ గ్రామంలో రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, మహిళలు, బడుగు బలహీనవర్గాలు, మైనార్టీ వర్గాల ప్రజలను, వివిద వృత్తులవారిని ఆప్యాయంగా పలకరించి వారి కష్టసుఖాలు తెలుసుకొని, ధైర్యం చెపుతూ భవిష్యత్‌ పట్ల భరోసా కల్పిస్తూ ముందుకు సాగుంటుండటం అందరూ కళ్ళారా చూస్తూనే ఉన్నారు.

నిన్న అంబేడ్కర్ జయంతి సందర్భంగా వైసీపీ నేతలు చాలా హడావుడి చేశారు. సంక్షేమ పధకాలు ఇస్తున్న తానే అసలు సిసలు వారసుడినన్నట్లు సిఎం జగన్‌ గొప్పగా చెప్పుకొన్నారు. దీని కోసం మళ్ళీ కోట్లు ఖర్చుచేసి ప్రకటనలు కూడా ఇచ్చుకొన్నారు.

అయితే అంబేడ్కర్ ఆశయాలకు విరుద్దంగా వైసీపీ ప్రభుత్వం జీవో నంబర్:1 తెచ్చి యువగళం పాదయాత్రని అడుగడుగునా అడ్డుకోవాలని ప్రయత్నించినప్పుడు నారా లోకేష్‌ రాజ్యాంగ పుస్తకం చేతపట్టుకొని పోలీసులకు చూపిస్తూ, “మీరు ఈ రాజ్యాంగం ప్రకారమే పని చేస్తున్నారా లేక వేరే రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నారా?” అంటూ నిలదీసిన రోజుని ఎవరూ మరిచిపోలేరు. అప్పటి నుంచే వైసీపీ ప్రభుత్వం కాస్త వెనక్కు తగ్గి ఆయన యువగళం పాదయాత్రని అడ్డుకోలేక చేతులెత్తేసింది. ఇటువంటి ప్రతికూల పరిస్థితులలో 70 రోజులలో 900 కిమీ పాదయాత్ర చేయడం మామూలు విషయం కాదు కదా?

విశేషమేమిటంటే, సరిగ్గా రాజ్యాంగ రచయిత డా.అంబేడ్కర్‌ జయంతి రోజునే నారా లోకేష్‌ యువగళం పాదయాత్రలో 900 కిమీ పూర్తి చేసి రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి ఉన్న బలం ఏమిటో చాటి చెప్పారు. ఒకవేళ అనాడు పోలీసులు అడ్డుకొంటున్నప్పుడు, కేసులకు భయపడి నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర విరమించుకొని ఉండి ఉంటే ఏమై ఉండేదని ఆలోచిస్తే టిడిపికి రాజకీయంగా పెద్ద ఎదురుదెబ్బ… అప్రదిష్టగా మారేదని అందరికీ తెలుసు.

కానీ నారా లోకేష్‌ అన్ని అవరోధాలను, చివరికి ప్రకృతి ప్రకోపాన్ని తట్టుకొని నిబ్బరంగా ముందుకు సాగుతూ ప్రజల మనసులు గెలుచుకొంటున్నారు. అంతేకాదు… వైసీపీ ప్రభుత్వ అసమర్దత, వైఫల్యాలు, విధానపరమైన తప్పుడు నిర్ణయాలను ఎండగడుతున్న విధానం రాష్ట్ర ప్రజలను ఆలోచింపజేస్తోంది.

నారా లోకేష్‌ ‘సెల్ఫీ ఛాలెంజ్’ పేరుతో ఆయా నియోజకవర్గాలలో వైసీపీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలు, ఆగడాలను, ఇసుక మాఫియాని చూపించి గట్టిగా నిలదీస్తున్నారు. దీంతో వారు నారా లోకేష్‌ తమ నియోజకవర్గాలలో అడుగుపెట్టక ముందే అక్రమాలు, ఇసుక తవ్వకాలను తాత్కాలికంగా అయినా నిలిపివేసుకొంటున్నారు. ఇది నారా లోకేష్‌ సాధించిన విజయమే కదా?

నారా లోకేష్‌ శుక్రవారం నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో ప్యాపిలి బీసీ కాలనీలో 900 కిమీ యువగళం పాదయాత్ర పూర్తిచేసిన సందర్భంగా రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గుండాల ప్రాజెక్టు నుంచి ఆలూరు, పత్తికొండ, డోన్, బనగానపల్లే నియోజకవర్గాల ప్రజలకు తాగు, సాగు నీరు అందిస్తానని హామీ ఇస్తూ దానిని శిలాఫలకంలో వ్రాయించి ఆవిష్కరించారు. నేడు పత్తికొండ నియోజకవర్గంలో నారా లోకేష్‌ 71వ రోజు యువగళం పాదయాత్ర ప్రారంభించారు.