Nara lokesh yuvagalam padayatra టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పాదయాత్రతో ఒరిగేదేమీ లేదని, ఆయనని అడ్డుకోవలసిన అవసరం తమ ప్రభుత్వానికి లేదని మంత్రులు ఆర్‌కె.రోజా, అంబటి రాంబాబు వంటివారు చెప్పారు. అలాగే ప్రతిపక్ష నేతలని అడ్డుకొనేందుకే రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్: 1 తెచ్చిందనే వారి వాదనలని కూడా మంత్రులు, సజ్జల రామకృష్ణారెడ్డి ఖండించారు. కానీ శుక్రవారం యువగళం పాదయాత్రలో జరిగిన పరిణామాలు చూస్తే ప్రతిపక్షాల వాదనలు నిజమని స్పష్టం అవుతోంది.

నారా లోకేష్‌ నిన్న సాయంత్రం 5.10 గంటలకి పూతలపట్టు నియోజకవర్గంలోని బంగారుపాళ్యం వద్ద చేరుకొనే సరికే అక్కడ భారీగా పోలీసులు మోహరించి ఉన్నారు. డీఎస్పీ సుధాకర్ రెడ్డి వచ్చి అక్కడ బహిరంగసభ నిర్వహించడానికి అనుమతి లేదని చెప్పడంతో తీవ్ర ఉద్రిక్తవాతావరణం నెలకొంది. పోలీసులు స్పీకర్ బాక్సులున్న వాహనాన్ని స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్‌కి తరలించబోతుంటే టిడిపి నేతలు, కార్యకర్తలు వారిని అడ్డుకొనే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా వారికీ పోలీసులకి మద్య తీవ్ర వాగ్వాదాలు జరిగాయి.

పోలీసులు సభకి అనుమతించకపోవడంతో నారా లోకేష్‌ పక్కనే ఉన్న భవనం మొదటి అంతస్తులోని బాల్కనీలో నిలబడి ప్రజలని ఉద్దేశ్యించి ప్రసంగించడంతో పోలీసులకి ఏమి చేయాలో పాలుపోక చూస్తుండిపోయారు.

పోలీసుల తీరుని నారా లోకేష్‌ తప్పు పట్టారు. జీవో నంబర్:1 సాకుతో ప్రతిపక్షాలు సభలు సమావేశాలు నిర్వహించుకోనీయకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను రాష్ట్ర ప్రజల సమస్యలతో పాటు పోలీసుల సెలవులు, జీతభత్యాల సమస్యల గురించి కూడా తన పాదయాత్రలో ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే, పోలీసులే తనకి అడ్డుపడటం చాలా బాధేస్తోందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఎన్ని అవరోధాలు సృష్టిస్తున్నా తన యువగళం పాదయాత్రని, పవన్‌ కళ్యాణ్‌ వారాహిని ఎవరూ ఆపలేరని నారా లోకేష్‌ అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం లబ్దిదారులకి పది రూపాయలు ఇస్తే దానిపై సిఎం జగన్‌ ఫోటో ముద్రించుకొంటారని, చెత్తపన్ను లేదో మరో పేరు చెప్పి ప్రజల నుంచి రూ.100లు గుంజుకొంటే వాటిపై సిఎం జగన్‌ ఫోటో ఎందుకు వేసుకోరని ప్రశ్నించారు. మరోసారి ప్రజలు జగన్‌కి అధికారం కట్టబెడితే ఈసారి ప్రజలు గాలి పీల్చుతున్నందుకు కూడా పన్ను వేస్తారని నారా లోకేష్‌ అన్నారు. 2019 ఎన్నికలలో ప్రజలు పాలిచ్చే ఆవుని వదిలి కాలితో తన్నే గేదె వంటి ప్రభుత్వాన్ని తెచ్చుకొని తీరికగా బాధపడుతున్నారని నారా లోకేష్‌ అన్నారు.

ఇద్దరు ఎన్‌ఆర్ఐలు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయాభివృద్ధికి రూ.10 కోట్లు నిధులు ఇవ్వాలనుకొంటే, ముందు నాకు 10% కమీషన్‌కు ఇవ్వాలని పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు డిమాండ్‌ చేయడం సిగ్గుచేటని నారా లోకేష్‌ అన్నారు. పూతలపట్టులో వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి తన అనుచరులతో అక్రమంగా ఇసుక వ్యాపారం చేస్తూ కోట్లు గడిస్తున్నారని నారా లోకేష్‌ ఆరోపించారు. జిడి.నెల్లూరులో వైసీపీ నేత విజయానంద రెడ్డి నకిలీ మద్యం తయారు చేస్తున్నారని నారా లోకేష్‌ ఆరోపించారు.

రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి రాగానే టిడిపి నేతలని, కార్యకర్తలని వేదించిన వైసీపీ నేతలని, పోలీసుల భరతం పడతానని నారా లోకేష్‌ హెచ్చరించారు. నారా లోకేష్‌, పార్టీ నేతలు, కార్యకర్తలు ఎంతగా నిరసనలు తెలిపినా పోలీసులు స్పీకర్ బాక్స్ ఉన్న వాహనాన్ని తిరిగి ఇవ్వనేలేదు. అడుగడుగునా పోలీసుల అవరోధాలు, తీవ్ర ఉద్రిక్తతల నడుమ నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర సాగింది.

దారిలో గంగతిమ్మనపాలెంకి చెందిన నాగరాజు అనే దివ్యాంగుడుని నారా లోకేష్‌ ఇదివరకు కలిసినప్పుడు జీవనోపాధికి తోపుడు బండి కావాలని అడిగారు. నిన్న దానిని నారా లోకేష్‌ అతనికి అందజేశారు. దారిలో శేషాపురంలో నారా లోకేష్‌ మహిళలతో మాట్లాడి వారి సమస్యలని అడిగి తెలుసుకొన్నారు.

సాయంత్రం 7.15 గంటలకి బంగారుపాలెం గ్రామంలో 100 కిమీ పాదయాత్ర పూర్తవడంతో ఈ తొలి విజయానికి గుర్తుగా అక్కడ తన సొంత ఖర్చుతో ఉచిత డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తానని నారా లోకేష్‌ ప్రకటించారు. అక్కడ శిలాఫలకాన్ని కూడా నారా లోకేష్‌ ఆవిష్కరించారు.

యువగళం పాదయాత్ర అడ్డుకోమన్నారు కానీ పోలీసులని పెట్టి అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారని, టిడిపి, జనసేనలకే జీవో నంబర్:1 వర్తిస్తుందా?అని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ప్రశ్నించారు. ప్రశాంతంగా సాగిపోతున్న పాదయాత్రని అడ్డుకొంటూ పోలీసులే కార్యకర్తలని రెచ్చగొట్టి మళ్ళీ వారిపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే జగన్‌ ప్రభుత్వం పోలీసులతో నారా లోకేష్‌ పాదయాత్రని అడ్డగిస్తోందని టిడిపి ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఆరోపించారు. యువగళం పాదయాత్రకి వస్తున్న ప్రజాధారణ చూసి వైసీపీ నేతలకి గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయని అందుకే అవరోధాలు సృష్టిస్తున్నారని చిత్తూరు లోక్‌సభ టిడిపి ఇన్‌ఛార్జ్‌ పులివర్తి నాని ఆరోపించారు.

`