Nara Lokesh padayatraయువగళం పాదయాత్ర సజావుగా సాగేందుకు సహకరించాల్సిన పోలీసులతోనే రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అవరోధాలు కల్పిస్తోంది. అయినా టిడిపి యువనాయకుడు నారా లోకేష్‌ ధైర్యంగా వాటిని ఎదుర్కొంటూ అలుపెరుగని బాటసారిలా 17 రోజులలో 200 కిమీ పాదయాత్ర పూర్తి చేశారు.

ఆదివారం తిరుపతి జిల్లా, చినరాజకుప్పం వద్ద నగరి నియోజకవర్గంలోకి ప్రవేశించి పాదయాత్ర చేసారు. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి స్వగ్రామమైన డీఏ పురంలో నారా లోకేష్‌ పాదయాత్ర చేస్తున్నప్పుడు అక్కడి గ్రామ ప్రజలు ఉపముఖ్యమంత్రి ఆగడాల గురించి నారా లోకేష్‌తో మొరపెట్టుకొన్నారు. ఆయన తమ భూములను లాక్కొని తమకి జీవనోపాధి లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

దారిలో టిటి కండ్రిగ వద్ద గ్రామస్తులతో నారా లోకేష్‌ మాట్లాడి వారి సమస్యలని అడిగి తెలుసుకొన్నారు. తమకి అనేక సంక్షేమ పధకాలు ఇస్తున్నట్లు పేపర్లలో ప్రకటనలు చూస్తున్నాము కానీ అవేమీ తమకి ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మంత్రిని, అధికారులని ఎన్నిసార్లు అడిగినా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. నాలుగు షుగర్ ఫ్యాక్టరీలు మూతటంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చెరుకు రైతులందరికీ మిగిలిన ఒకే ఒక షుగర్ ఫ్యాక్టరీ మీద ఆధారపడవలసి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీని వలన తాము తీవ్రంగా నష్టపోతున్నామని చెప్పగా నారా లోకేష్‌ స్పందిస్తూ, ‘వైసీపీ ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించలేకపోయిందని, ఫ్యాక్టరీలు మూతపడటంతో వాటిలో పనిచేసే కార్మికులు కూడా రోడ్డున పడే దుస్థితి ఏర్పడిందన్నారు. టిడిపి అధికారంలోకి రాగానే ముందుగా రేణిగుంట షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని నారా లోకేష్‌ హామీ ఇచ్చారు. నారా లోకేష్‌ పాదయాత్ర ముగించుకొని ఆదివారం రాత్రి చెర్లోపల్లి క్యాంప్ సైట్ వద్ద బస చేశారు.

సోమవారం మంత్రి ఆర్‌కె.రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తారు కనుక ఆమె నోటికి పనిచెప్పడం ప్రారంభిస్తారు. జిల్లాలో నగరి నియోజకవర్గంలో పాదయాత్ర మొదలుపెట్టి చంద్రగిరి వద్ద ముగిస్తారు. మంగళ, బుద, గురువారలలో సత్యవేడు నియోజకవర్గంలోని నారాయణవనం, పిచ్చాటూరు, కేవీబీపురం మండలాలలో నారా లోకేష్‌ పాదయాత్ర చేస్తారు. శుక్రవారం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తారు. శనివారం మహాశివరాత్రి కనుక నారా లోకేష్‌ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాళహస్తిలో ప్రత్యేకపూజలు చేయనున్నారు. ఆరోజు పాదయాత్ర చేయకపోవచ్చు. శనివారం ఏర్పేడు, పాపానాయుడుపేట, గాజుల మండ్యం, రేణిగుంట మీదుగా పాదయాత్ర చేస్తూ 21వ తేదీన తిరుపతి చేరుకొంటారు.