టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర అప్పుడే 11వ రోజుకి చేరుకొంది. మొదటి వందకిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేసి దిగ్విజయంగా ముందుకు సాగుతుంటే, మహా అయితే ఆయన రెండు మూడు రోజుల కంటే ఎక్కువ నడవలేరని వాదించిన వైసీపీ నేతల నోళ్ళు మూతపడ్డాయి. నారా లోకేష్ వెంట ప్రతీరోజు వందలాదిమంది పాదయాత్ర చేస్తున్నారు. ఆయన ఎక్కడ సమావేశం లేదా మినీ సభ నిర్వహించినా వేలాదిగా తరలివస్తుండటం చూసి వైసీపీ నేతలకి ఏం మాట్లాడాలో పాలుపోక సైలెంట్ అయిపోయారు.
ఇదివరకు నారా లోకేష్ పాదయాత్ర గురించి అవహేళనగా మాట్లాడినా వైసీపీ నేతలే ఇప్పుడు, ముందు ఆయన మా జిల్లా దాటిపోతే చాలని… ఆయన మా జిల్లాలో ప్రవేశిస్తే ఎలా ఎదుర్కోవాలని తలలు పట్టుకొంటున్నారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు నేరుగా అడ్డుకోవడం కంటే జీవో నంబర్:1 పేరుతో పోలీసులతో అడ్డగించడం, ఏవో సాకుతో కేసులు నమోదు చేయడం మంచిదని వైసీపీ ప్రభుత్వం గ్రహించిన్నట్లే ఉంది.
ఈరోజు సోమవారం 11వ రోజున నారా లోకేష్ చిత్తూరు నియోజకవర్గంలోని మంగసముద్రం నుంచి యువగళం పాదయాత్ర మొదలుపెట్టారు. ముందుగా “సెల్ఫీ విత్ నారా లోకేష్” కార్యక్రమంలో భాగంగా తనని కలిసేందుకు వస్తున్నవారితో సెల్ఫీలు దిగారు. ఆ తర్వాత పాదయాత్ర మొదలుపెట్టి బిడి. కాలనీ, కోర్టు సర్కిల్, గాంధీ సర్కిల్, ఎంఎస్ఆర్ సర్కిల్, గ్రీమ్స్ పేట మీదుగా మధ్యాహ్నం ఒంటి గంటకి అమర్ రాజా క్యాంప్ సైట్ చేరుకొన్నారు. దారిలో వివిద వర్గాల ప్రజలతో మాట్లాడుతూ, వారి సమస్యలని అడిగి తెలుసుకొంటూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వ విధానాలని, ముఖ్యంగా సిఎం జగన్మోహన్ రెడ్డి తీరుని ఎండగడుతూ రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే విద్యా, వ్యవసాయం, సాగునీరు తదితర రంగాలలో ఎటువంటి విధానాలు అమలుచేస్తామో నారా లోకేష్ ప్రజలకి వివరిస్తున్నారు.
మధ్యాహ్నం భోజన విరామం తర్వాత మళ్ళీ పాదయాత్ర ప్రారంభించి దారిలో జిల్లా పార్టీ కార్యాలయం వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలతో నారా లోకేష్ సమావేశమయ్యి జిల్లాకి సంబందించిన పార్టీ వ్యవహారాలు, ప్రజా సమస్యల గురించి అడిగి తెలుసుకొన్నారు.
ఈరోజు పాదయాత్రలో చిత్తూరుకి చెందిన న్యాయవాదులు, విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, ముస్లిం మైనార్టీలు నారా లోకేష్‌ని కలిసి తమ సమస్యల గురించి చెప్పుకొన్నారు.