Nara Lokesh Yuvagalam Padayatraటిడిపి యువనేత నారా లోకేష్‌ శుక్రవారం అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర చేస్తున్నప్పుడు, ప్రజలతో మాట్లాడుతూ గంజాయితో పేద ప్రజల జీవితాలు ఏవిదంగా నాశనం అవుతున్నాయో వివరిస్తూ, “నేను చంద్రగిరి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఓ మహిళ తన ఇద్దరు కూతుర్లను నా వద్దకు తీసుకువచ్చి పదో తరగతి చదువుతున్న వీళ్ళిద్దరికీ స్థానిక వైసీపీ నేతలు గంజాయి అలవాటు చేసి వారి జీవితాలు నాశనం చేస్తున్నాడు. వీరిని నువ్వే ఆదుకోవాలన్నా… అంటూ అడిగినప్పుడు నేను షాక్ అయ్యాను.

ఈవిదంగా స్కూలు విద్యార్థులకు కూడా గంజాయికి బానిసలైతే వారి జీవితాలు ఏమైపోతాయి? అని ఆలోచించి #గాంజా వద్దు బ్రో… అనే ఓ ఉద్యమం ప్రారంభించాను. ఇక నుంచి ప్రతీ ఒక్కరూ గంజాయికి దూరంగా ఉంటామని ప్రమాణం చేయాలి లేకుంటే మన కుటుంబాలే సర్వనాశనం అయిపోతాయి. ఈ జగన్‌ రెడ్డి ప్రభుత్వం, వైసీపీ నేతలు అందరూ ప్రజలకు ఏమీ చేయకపోగా వారి జీవితాలతో ఈవిదంగా ఆడుకొంటున్నారు. టిడిపి అధికారంలోకి వస్తే గంజాయి సాగు, సరఫరా, వాడకంపై ఉక్కుపాదం మోపుతామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను,” అని అన్నారు.

#గాంజా వద్దు బ్రో… ఉద్యమం చిన్నగా మొదలైనప్పటికీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఉదృతంగా సాగుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు దీనికి మద్దతు తెలుపుతున్నారు. అయితే ఈ ఉద్యమం మొదలుపెట్టి 24 గంటలు కాక మునుపే అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలంలోని రేగుపాలెం జంక్షన్ వద్ద AP16TA-7886 నంబరుగల లారీలో 1,200 కేజీల గంజాయిని తరలిస్తుండగా నార్కోటిక్ విభాగం పోలీసులు పట్టుకున్నారు. దీనిని హైదరాబాద్‌ తరలిస్తున్నట్లు పక్కా సమాచారం అందడంతో నార్కోటిక్ విభాగం పోలీసులు కాపు కాచి పట్టుకొన్నారు. ఒకేసారి ఇంత భారీ మొత్తంలో గంజాయిని హైదరాబాద్‌ తరలిస్తుండటం చూస్తే ఏపీలో గంజాయి సాగు, సరఫరా, వ్యాపారం ఏ స్థాయిలో జరుగుతోందో ఊహించుకోవచ్చు.

రాష్ట్ర విభజన జరిగి దాదాపు 9 ఏళ్ళవుతోంది. తొమ్మిదేళ్ళలో పక్కనే ఉన్న తెలుగు రాష్ట్రం తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధిపదంలో దూసుకుపోతూ నంబర్: 1 స్థానంలో నిలుస్తుంటే, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కనీసం రాజధాని కూడా లేకుండా, ఉద్యోగులకు నెలనెలా జీతాలు కూడా చెల్లించేలేని దుస్థితిలో అప్పుల ఊబిలో కూరుకుతోంది. ఇప్పుడు ఈ గంజాయి సమస్య కూడా రాష్ట్రాన్ని పట్టి పీడిస్తోంది. ఈ లెక్కన ముందుకు సాగుతుంటే ఏదో ఓ రోజు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కూడా బీహార్ రాష్ట్రంలా తయారవుతుందేమో?