Nara Lokesh Yuvagalam Padayatraటిడిపి యువనేత నారా లోకేష్‌ యువగళం పాదయాత్రలో 77వ రోజున శుక్రవారం కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గంలో సిరిగుప్ప వద్ద 1,000 కిమీ మైలురాయిని అధిగమించారు. ఈ సందర్భంగా నియోజకవర్గం అభివృద్ధి పనులకు సంబందించి ఇచ్చిన హామీలతో కూడిన శిలాఫలకాన్ని నారా లోకేష్‌ ఆవిష్కరించారు.

ఆదోని పట్టణంలో 21వ వార్డు పరిస్థితి చూసి నారా లోకేష్‌ చలించిపోయారు. ఆ వార్డును తాను దత్తత తీసుకొని రోడ్లు, త్రాగునీరు, డ్రైయినేజి, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలను తాను కల్పిస్తానని నారా లోకేష్‌ ప్రజలకు హామీ ఇచ్చారు. రాయలసీమ గడ్డపై 1,000 కిమీ పాదయాత్ర పూర్తిచేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నానని నారా లోకేష్‌ అన్నారు. తన పాదయాత్రలో తోడుగా నడుస్తూ విజయవంతం చేస్తున్న రాయలసీమ ప్రజలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని నారా లోకేష్‌ అన్నారు.

తన యువగళం పాదయాత్రకు వస్తున్న అపూర్వ స్పందన చూస్తుంటే ప్రజలు మార్పు కోరుకొంటున్నారని స్పష్టమవుతోందని, త్వరలోనే జగన్మోహన్ రెడ్డికి బైబై చెప్పేద్దామన్నారు. ఆయన చెప్పే అబద్ధాలు చూసి ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారని అన్నారు. గత ఎన్నికలలో తాడేపల్లిలో ఇల్లు కట్టుకొంటున్నానని అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పారు. ఈసారి ఎన్నికలలో విశాఖలో కాపురం పెడతానని విశాఖ రాజధానిగా చేస్తానని చెపుతున్నారు. ఇంకా ఎన్ని అబద్దాలు చెపుతావు జగన్‌ రెడ్డీ? అంటూ నారా లోకేష్‌ ప్రశ్నించారు. 2024 ఎన్నికల తర్వాత జగన్‌ లండన్‌లో కాపురం పెడతారని నారా లోకేష్‌ జోస్యం చెప్పారు.

యువగళం పాదయాత్రకు ఆటంకం కలిగిస్తే తొక్కుకొంటూ పోతామని నారా లోకేష్‌ మొదటి నుంచే హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న ఆదోని పట్టణంలో పాదయాత్ర చేస్తుండగా కొందరు వైసీపీ కార్యకర్తలు నారా లోకేష్‌ను అడ్డుకోబోయారు. కానీ నారా లోకేష్‌ ఏమాత్రం వెనక్కు తగ్గకుండా మీసం మెలేసి అందరికీ గుండు కొట్టించి పంపిస్తానంటూ గట్టిగా హెచ్చరించారు.