Nara Lokeshటిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర ప్రారంభించి అప్పుడే 6 రోజులు పూర్తయిపోయింది. ఆయన పాదయాత్రకి వస్తున్న అపూర్వమైన ప్రజా స్పందన చూస్తూ కూడా రోజా, అంబటి రాంబాబు వంటి మంత్రులు ‘ఒరిగేదెలే…’ అంటూ పెదవి విరుస్తున్నప్పటికీ, వైసీపీ నేతలు ఎటువంటి ఆటంకాలు సృష్టించే ప్రయత్నం చేయకపోవడం గుడ్డిలో మెల్లనుకోవచ్చు.

యువగళం పాదయాత్రలో 6వ రోజైన ఈరోజు నారా లోకేష్‌ కమ్మనపల్లె కస్తూరిబా పాఠశాల వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభించారు. దారిలో బైరెడ్డిపల్లె మండలంలో చెరుకు రైతులతో మాట్లాడి వారి సమస్యలని అడిగి తెలుసుకొన్నారు. ఆ తర్వాత బేలుపల్లెలో పాదయాత్ర సాగుతున్నప్పుడు అక్కడ నారా లోకేష్‌ కోసం ఎదురుచూస్తున్న భవన నిర్మాణ కార్మికులతో మాట్లాడారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇసుక కొరతతో భవననిర్మాణ పనులు మందకోడిగా సాగుతుండటంతో తమకి రోజూ ఉపాధి లభించక నానా అవస్థలు పడుతున్నామని వారు నారా లోకేష్‌ వద్ద తమ గోడు వెళ్ళబోసుకొన్నారు. వారికి నారా లోకేష్‌ ధైర్యం చెప్పి మరో ఏడాదిపాటు ఓపిక పడితే ఈ ప్రభుత్వం దిగిపోయి టిడిపి అధికారంలోకి వస్తుందని అప్పుడు మళ్ళీ పాత ఇసుక విధానాన్ని అమలుచేస్తామని భరోసా ఇచ్చారు.

పాదయాత్రలో దారి పొడవునా మహిళలు, వృద్ధులు, రైతులు ఇంకా వివిద వర్గాల ప్రజలు నారా లోకేష్‌ చేతులు పట్టుకోని ఆప్యాయంగా పలకరిస్తుండటం విశేషం. ప్రజల ప్రేమాభిమానాలు చూసి నారా లోకేష్‌ కూడా దారిలో అందరినీ పలకరిస్తూ మెల్లగా ముందుకు సాగుతుండటంతో పాదయాత్ర అనుకొన్న దానికంటే చాలా ఆలస్యంగా సాగుతోంది. దీంతో నారా లోకేష్‌ వెంట నడుస్తున్నవారు కాస్త వేగంగా నడవాలని సూచిస్తుంటే, గ్రామస్తులు “ఏం నాయినా మమ్మల్ని పలకరించకుండానే వెళ్ళిపోతావా?” అని ఆప్యాయంగా అడుగుతుండటంతో నారా లోకేష్‌ మెల్లగా నడవాల్సివస్తోంది. స్థానిక కార్యకర్తలు కూడా నారా లోకేష్‌ని తమ గ్రామంలో కాస్త మెల్లగా పాదయాత్ర చేయాలని కోరుతున్నారు. వారు కూడా చాలా ఉత్సాహంగా నారా లోకేష్‌తో కలిసి నడుస్తున్నారు.

ఇదివరకు నారా లోకేష్‌ ప్రసంగిస్తున్నప్పుడు కాస్త తడబడుతుండేవారు. కానీ ఇప్పుడు అనర్గళంగా మాట్లాడుతుండటమే కాకుండా, కాస్త నాటకీయంగా కూడా మాట్లాడుతుండటంతో ప్రజలు కూడా ఉత్సాహంగా ఆయన ప్రసంగాలు వింటున్నారు. సిఎం జగన్మోహన్ రెడ్డి రూ.8కోట్లు ఖర్చు చేసి ప్రత్యేక విమానంలో దావోస్ పర్యటన చేయడం గురించి నారా లోకేష్‌ చెపుతున్నప్పుడు, ఆయన మాట తీరు, హావభావాలు చూసి ప్రజలు హాయిగా నవ్వుకొన్నారు.

రాజకీయాలలో ఉన్నవారికి వివిద అంశాలపై అవగాహన ఎంత ముఖ్యమో, దానిని ప్రజలకి అర్దమయ్యేలా వివరిస్తూ వారిని ఆకట్టుకోవడం కూడా అంతే ముఖ్యం. అప్పుడే ప్రజలు సదరు నాయకులతో కనెక్ట్ అవుతుంటారు. ఈవిషయంలో నారా లోకేష్‌ చాలా పరిణతి సాధించిన్నట్లే కనిపిస్తున్నారు. పాదయాత్ర ముగిసేలోగా మరింత రాటుతేలుతారు.