Nara_Lokesh_Yuva_Galamయువగళం పేరుతో నారా లోకేష్‌ ఈ నెల 27వ తేదీన కుప్పం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టబోతున్నారు. మొదటి మూడు రోజులూ కుప్పం నియోజకవర్గంలోనే నారా లోకేష్‌ పాదయాత్ర సాగుతుంది. మొత్తం 400 రోజులపాటు 4,000 కిమీ మేర రాష్ట్రంలో అన్ని జిల్లాలగుండా సాగే ఈ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో భారీ బహిరంగసభతో ముగుస్తుంది.

దీని కోసం టిడిపి విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది. నారా లోకేష్‌ పాదయాత్రలో ఇంకా తొలి అడుగువేయనే లేదు అప్పుడే వివిద జిల్లాలలో తెలుగు యువత హడావుడి మొదలైపోయింది.

విశాఖపట్నంలో రామకృష్ణా బీచ్‌ వద్ద సోమవారం సాయంత్రం కొందరు యువతీయువకులు నారా లోకేష్‌ యువగళం పాదయాత్రకి మద్దతుగా ఫ్లాష్ మాబ్ (డ్యాన్స్) చేసి అందరినీ ఆకట్టుకొన్నారు. ఇదే విదంగా విజయవాడలో కూడా నిన్న నిర్వహించిన ఫ్లాష్ మాబ్‌కి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది.

ఈ ఫ్లాష్ మాబ్‌లో సుమారు 20-25 మంది యువతీయువకులు నారా లోకేష్‌-యువగళం లోగో కలిగిన పసుపు, ఎరుపు కాంబినేషన్‌లో టీషర్ట్స్, నలుపు జీన్ ఫ్యాంట్స్ ధరించి అత్యద్భుతంగా డ్యాన్స్ చేశారు. యువగళం… యువగళం… అంటూ సాగే ఫాస్ట్ బీట్ సాంగ్‌, దాని మ్యూజిక్, వారి డ్యాన్స్ చాలా అద్భుతంగా ఉండటంతో నగరవాసులు, ముఖ్యంగా యువతని బాగా ఆకట్టుకొంది. ఏపీలోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలలో ఈ ఫ్లాష్ మాబ్స్ నిర్వహించవచ్చని సమాచారం.

నారా లోకేష్‌ పాదయాత్ర ప్రారంభించక మునుపే రాష్ట్రంలో మొదలైన ఈ హడావుడితో యువగళం పాదయాత్రకి మంచి ప్రచారం లభిస్తోంది. కనుక నేడో రేపో పోలీసులు వీటిపై ఆంక్షలు లేదా కేసులు నమోదు చేసినా ఆశ్చర్యం లేదని టిడిపి నేతలు భావిస్తున్నారు.