Nara_Lokesh_Yuva_Galam_Padayatraనారా లోకేష్‌ యువగళం పాదయాత్రపై అప్పుడే వైసీపీ నేతలు విమర్శలు మొదలైపోయాయి. నారా లోకేష్‌ ఏ అర్హతతో పాదయాత్ర చేస్తున్నారని, ఏ అర్హతతో టిడిపి తరపున హామీలు ఇస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. నిన్న కుప్పం సభలోనే నారా లోకేష్‌ తాను రెండు శాఖలకి మంత్రిగా పనిచేసిన సంగతిని వైసీపీ నేతలకి గుర్తు చేశారు.

అయినా ఉద్యోగాలకి అర్హత ఉన్నట్లే పాదయాత్రలకి కూడా ఎమ్మెల్యే, ఎంపీ వంటి పదవులు అర్హత కలిగి ఉండాలని వైసీపీ నేతలు ఎందుకు భావిస్తున్నారో తెలీదు కానీ ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ఎవరైనా పాదయాత్ర చేయవచ్చు. అమరావతి రైతులు రాజధాని సమస్యపై పాదయాత్ర చేయడమే ఇందుకు తాజా నిదర్శనం. కనుక ప్రజల తరపు పోరాడాలనే తపన, ప్రభుత్వాన్ని ప్రశ్నించగల ధైర్యమే పాదయాత్రకి అర్హతలవుతాయి.

ఇక నారా లోకేష్‌ ఏ అర్హతతో టిడిపి తరపున ఎన్నికల హామీలని ప్రకటిస్తున్నారనే వైసీపీ నేతల ప్రశ్నకి జవాబు వారికే బాగా తెలుసు. టిడిపి జాతీయ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న నారా లోకేష్‌, పార్టీ మ్యానిఫెస్టో రూపకల్పన, టికెట్స్ కేటాయింపు, వివిద రంగాలపై పార్టీ పాలసీలు, పార్టీ విధివిధానాలు… ఇలా ప్రతీ విషయంలోనూ ఆయన ప్రమేయం తప్పక ఉంటుంది. కనుక వాటి గురించి మాట్లాడే హక్కు, సాధికారత ఆయనకి తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు ఆయన చెపుతున్నవే రేపు టిడిపి ఎన్నికల మ్యానిఫెస్టోలో వస్తాయి కూడా.

టిడిపి గెలిస్తే చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అవుతారని నారా లోకేష్‌ స్వయంగా చెపుతున్నారు. కనుక ఆయన తరపున, పార్టీ తరపున నారా లోకేష్‌ ఉద్యోగ కల్పన, పరిశ్రమలు, పెట్టుబడులు, వ్యవసాయం తదితర రంగాలకి సంబందించి పార్టీ విధానాలని చూచాయగా తన ప్రసంగంలో తెలిపారు. అయినా వైసీపీ నేతలు నారా లోకేష్‌ని ఈ ప్రశ్న అడగటమే తప్పు. తద్వారా రాబోయే ఎన్నికలలో టిడిపి గెలిచి అధికారంలోకి వస్తుందని అంగీకరిస్తున్నట్లయింది కదా?