Nara_Lokesh_Yuva_Galam_Padayatra_Unstoppableటిడిపి యువనేత నారా లోకేష్‌ నేడు 29వ రోజు యువగళం పాదయాత్రని చంద్రగిరి నియోజకవర్గంలో చేస్తున్నారు. ఈరోజు ఉదయం తొండవాడ బహిరంగసభలో నారా లోకేష్‌ ప్రజలని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “జగన్‌ది గవర్నమెంట్ ఆర్డర్… లోకేష్‌ది పబ్లిక్ ఆర్డర్. అహంకారంతో విర్రవీగుతున్న సిఎం జగన్మోహన్ రెడ్డి జీవో (నంబర్:1)తో నన్ను అడ్డుకోవాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. ఎందువల్ల అంటే నేను ప్రజల ఆర్డర్ (ఆదేశాల)ని గౌరవించి మీ వద్దకు కాలినడకన వస్తున్నాను. నేను మీ సమస్యలు తెలుసుకొని, మీ భవిష్యత్‌కు హామీ ఇచ్చేందుకే ఈ యువగళం పాదయాత్ర చేస్తున్నాను. రాష్ట్ర ప్రజలు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నా గత నాలుగేళ్ళుగా తాడేపల్లి ప్యాలస్‌కి మాత్రమే పరిమితమైన సిఎం జగన్మోహన్ రెడ్డి, యువగళం పాదయాత్ర దెబ్బకి మేల్కొని పల్లె నిద్రలకి బయలుదేరుతున్నాడు,” అని నారా లోకేష్‌ ఎద్దేవా చేశారు.

గమ్మతైన విషయం ఏమిటంటే, నారా లోకేష్‌ని చేతకానివాడుగా బ్రాండింగ్ చేసింది వైసీపీయే. దేశంలో రాహుల్ గాంధీ తర్వాత ఎక్కువగా నేనే ట్రోల్ అయ్యానని నారా లోకేష్‌ స్వయంగా చెప్పుకొన్నారు. ఆ స్థాయిలో నారా లోకేష్‌తో ఆడుకొన్న వైసీపీ నేతలు ఇప్పుడు అదే నారా లోకేష్‌ మాటలలో పదును, పాదయాత్రలో దూకుడు చూసి కంగారుపడుతున్నారు.

నారా లోకేష్‌ పాదయాత్ర ప్రారంభించి ఇంకా 29 రోజులే అయ్యింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే సాగుతోంది. కానీ ఆ ప్రభావం యావత్ ఆంద్ర రాష్ట్రంలో కనిపిస్తోంది. నారా లోకేష్‌ వ్యక్తిత్వం, యువగళం పాదయాత్ర గురించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ మొదలైంది. ముఖ్యంగా నారా లోకేష్‌ జగన్ ప్రభుత్వాని, స్థానిక ఎమ్మెల్యేలని నిలదీస్తున్న తీరు, తనని అడ్డగించాలని ప్రయత్నిస్తున్న పోలీసులని భారత రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని నారా లోకేష్‌ హితవు చెపుతుండటం చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.

నారా లోకేష్‌ పాదయాత్రలో పెద్దలు, మహిళల పట్ల గౌరవంగా మెసులుతున్న తీరు, యువతలో ఒకడిగా కలిసిపోతూ చదువు, పరిశ్రమలు, ఉద్యోగావకాశాలు, భవిష్య ప్రణాళికల గురించి చర్చిస్తున్న తీరు చూసి 2019 ఎన్నికలలో ఈయన గురించేనా వైసీపీ అంతగా దుష్ప్రచారం చేసింది?అని ప్రశ్నిస్తున్నారు.

ఆ ఎన్నికలలో టిడిపిని ఓడించేందుకే ఐ-ప్యాక్ వ్యూహంలో భాగంగా నారా లోకేష్‌పై ఓ పద్దతి ప్రకారం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైసీపీ దుష్ప్రచారం చేసిందనే విషయం రాష్ట్ర ప్రజలకి కూడా ఇప్పుడు అర్దమవుతోంది. కనుక ఇప్పుడు మళ్ళీ నారా లోకేష్‌ గురించి అదేవిదంగా దుష్ప్రచారం చేస్తే ప్రజలు నమ్మబోరు కనుక నారా లోకేష్‌ని ఎదుర్కోవడం కోసం ఐ-ప్యాక్ మరో కొత్త ఆలోచన చేస్తుందేమో? కనుక ఐ-ప్యాక్ వ్యూహాలని అప్రమత్తంగా కనిపెట్టుకొని ఉండటం చాలా అవసరమే.