Nara_Lokesh_Yuva_Galam_Padayatra_Karnatakaటిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ కుప్పం నుంచి ఈ నెల 27వ తేదీన యువగళం పాదయాత్ర ప్రారంభించాలనుకొన్నప్పుడు, చివరి నిమిషం వరకు అనుమతీయకుండా ఇబ్బంది పెట్టింది. ఒకవేళ అనుమతించకపోతే హైకోర్తుని ఆశ్రయిస్తామని టిడిపి హెచ్చరించిన తర్వాతే చిత్తూరు పోలీసులు అనుమతించారు. కానీ సవాలక్ష ఆంక్షలు విధించారు. ఇక తొలిరోజు నుంచే ఏపీలో యువగళం పాదయాత్రకి అపూర్వమైన స్పందన వస్తుండటంతో మంత్రులు రోజా, అంబటి రాంబాబు వంటివారు అవాకులు చవాకులు వాగుతూనే ఉన్నారు.

ఏపీలో అధికార పార్టీ నేతలు, పోలీసులు ఈవిధంగా వ్యవహరిస్తుంటే, నిన్న నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర ఆదివారం కర్నాటకలోని సరిహద్దు గ్రామం గుండిశెట్టిపల్లెలో ప్రవేశించినప్పుడు అక్కడ బేతమంగళం సిఐ సునీల్ రాజు అధ్వర్యంలో 50 మంది పోలీసులతో రోప్ పార్టీని ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ స్వయంగా బందోబస్తుని పర్యవేక్షిస్తూ నారా లోకేష్‌ పాదయాత్రకి వాహనాల వలన ఎటువంటి ఆటంకం లేకుండా ట్రాఫిక్ నియంత్రించారు. తన పాదయాత్రకి ఇంతగా సహకరించినందుకు నారా లోకేష్‌ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకొని ముందుకు సాగారు.

ఏపీలో పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రజలని ఉద్దేశ్యించి మాట్లాడేందుకు కనీసం మైక్ వినియోగించడానికి కూడా పోలీసులు అంగీకరించకపోవడంతో నారా లోకేష్‌ ఎక్కడికక్కడ ఆగుతూ స్థానికులతో ముఖాముఖి మాట్లాడుతూ వారి సమస్యలని అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. మైక్ వినియోగించకుండా ఆంక్షలు విధించడం వలన నారా లోకేష్‌ ప్రజలతో నేరుగా మాట్లాడగలుగుతున్నారు. కనుక ఇదీ ఒకందుకు మంచిదే అనుకోవచ్చు.