Nara_Lokesh_Yuva_Galam_Padayatra_21_Days_Finishedవైసీపీ నేతలు ఎవరూ ఊహించనివిదంగా టిడిపి యువనేత నారా లోకేష్‌ 21 రోజులు యువగళం పాదయాత్ర పూర్తి చేసుకొని ఉత్సాహంగా ముందుకు సాగిపోతున్నారు. కనుక పాదయాత్రకి బ్రేకులు వేసేందుకు వైసీపీ ప్రభుత్వం సాకులు వెతుకుతోంది.

నారా లోకేష్‌ నేడు లక్ష్మీపురం గ్రామం వద్ద శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రవేశించబోతున్నారు. అక్కడి నుంచి కొత్త కండ్రిగ మీదుగా ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల ఎన్టీఆర్‌ విగ్రహం వరకు పాదయాత్ర చేస్తారు. అక్కడి నుంచి శ్రీకాళహస్తి పట్టణంలోని చతుర్మాడ వీధుల గుండా ముందుకు సాగి పొన్నాలమ్మ గుడి వద్ద హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద రాత్రి బస చేస్తారు. రేపు శివరాత్రి సందర్భంగా పాదయాత్రకి విరామం తీసుకొని సతీసమేతంగా శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకొంటారు.

రేపు శివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలోని చతుర్మాడ వీధులలో పాదయాత్రకి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసులు పాదయాత్ర నిర్వాహకులకి నిన్న తెలియజేశారు. శివరాత్రికి శ్రీకాళహస్తిలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది కనుక వేరే మార్గంలో పాదయాత్ర చేసుకోవాలని సూచించారు.

అయితే పది రోజుల ముందే పాదయాత్రకి అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకొన్నప్పుడే ఫిభ్రవరి 18న శివరాత్రి అని, భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని పోలీసులకు తెలుసు. అయినా మాడవీధుల్లో పాదయాత్రకి అనుమతించారు. ఇప్పుడు ఎందుకు అనుమతి నిరాకరిస్తున్నారని టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. మాడవీధుల్లో భక్తుల రద్దీ ఉన్నట్లయితే నారా లోకేష్‌ వారికి ఏమాత్రం ఇబ్బంది కలిగించకుండా ముందుకు సాగిపోతారని టిడిపి నేతలు చెపుతున్నారు. కానీ పోలీసులు అంగీకరించడం లేదు. కనుక నేటి యువగళం పాదయాత్రలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి.

నారా లోకేష్‌ పాదయాత్రకి రక్షణ కల్పించవలసిన పోలీసులు, డజన్ల కొద్దీ వాహనాలతో వచ్చి హడావుడి చేస్తూ ప్రజలని భయబ్రాంతులు చేసేవిదంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అల్లరి మూకలని చెదరగొట్టేందుకు ఉపయోగించే వజ్ర వాహనాన్ని ఎందుకు తీసుకువచ్చారని టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. జగన్ ప్రభుత్వం తెలివిగా పోలీసులతో యువగళం పాదయాత్రని అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తోందని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పేరుతో పాదయాత్రని నిలిపివేయాలని ప్రయత్నిస్తే సహించబోమని టిడిపి నేతలు హెచ్చరిస్తున్నారు.