Nara_Lokesh_APSRTCటిడిపి యువనేత నారా లోకేష్‌ ఈరోజు తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు దారిలో పిచాటూరు వద్ద ఆర్టీసీ బస్సు ఎదురైతే దానిలో ఎక్కి బస్సులో ప్రయాణికులతో మాట్లాడారు. నారా లోకేష్‌ని హటాత్తుగా బస్సులో చూసేసరికి అందరూ మొదట ఆశ్చర్యపోయారు కానీ తేరుకొని చాలా సంతోషంగా మాట్లాడారు.

నారా లోకేష్‌ మహిళా ప్రయాణికుల వద్దకి వెళ్ళి “ఏమ్మా బాగున్నావా? టికెట్‌ని ఛార్జీలు పర్లేదా?చాలా పెరిగాయి కదా?మన జగనన్న ప్రభుత్వం కదా… మళ్ళీ పెరుగుతాయేమో కూడా! టిడిపి అధికారంలోకి వచ్చేదాకా ఈ బాదుడు భరించక తప్పదు మరి,” అని అన్నారు. ప్రయాణికులు కూడా నారా లోకేష్‌ మాటలతో ఏకీభవిస్తూ “ఏం చేస్తాం… తప్పదు కదా…” అంటూ నిట్టూర్పు విడిచారు.

తర్వాత నారా లోకేష్‌ డ్రైవర్, కండెక్టర్లని ఆప్యాయంగా పలకరిస్తూ, “ఏమన్నా… ఈనెల జీతాలు పడ్డాయా.. ఇంకా లేదా?ప్రభుత్వంలో విలీనం అయ్యాక ఎలా ఉంది పనీ… ఉద్యోగం?అంతా ఒకేనా… ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా?” అంటూ నారా లోకేష్‌ అడిగి తెలుసుకొన్నారు. బస్సులో కొంత దూరం ప్రయాణించి అందరికీ బై చెప్పి దిగిపోయి మళ్ళీ పాదయాత్ర ప్రారంభించారు.

ఒకప్పుడు ప్రజలతో కలిసేందుకు బిడియపడే నారా లోకేష్‌ ఇప్పుడు ఇంత చనువుగా అందరినీ పలకరిస్తూ మాట్లాడటం చూసి టిడిపి నేతలు, కార్యకర్తలే ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు… నారా లోకేష్‌ భాష, యాసపై పట్టు సాధించి అలవోకగా మాట్లాడుతుంటే చాలా సంతోషిస్తున్నారు. నారా లోకేష్‌ బాడీ లాంగ్వేజ్‌లో కూడా చాలా మార్పు కనబడుతోంది. సామాన్య ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ఎంత వినయంగా, ప్రేమగా వారిలో ఒక్కరన్నట్లు కలిసిపోతూ మాట్లాడుతుంటారో, వైసీపీ నేతలనీ ఉద్దేశ్యించి మాట్లాడుతున్నప్పుడు “ఇదిగో జగన్‌ రెడ్డీ… దమ్ముంటే రా..లేదా నేనే వస్తున్నా రెడీగా ఉండు,” అంటూ ఆవేశంగా మాట్లాడుతున్నారు.

మంత్రి రోజాని ఉద్దేశ్యించి “జబర్దస్త్ ఆంటీ…” అంటూ ఆమె ప్రభుత్వ భూములు కొట్టేశారని చెప్పేందుకు “గోవిందా… గోవిందా…అయిపోయాయి” అంటూ నాటకీయంగా చెప్పడం చూస్తే ప్రజలతో ఏవిదంగా కనెక్ట్ అవ్వాలో నారా లోకేష్‌ బాగానే నేర్చుకొన్నారని అర్దమవుతోంది. కనుక పాదయాత్రలో ముందుకు సాగుతున్న కొద్దీ నారా లోకేష్‌ భాష, యాస, ప్రజా సమస్యలపై మరింత పట్టు సాధించి వైసీపీ ప్రభుత్వాన్ని ఎండగట్టడం కూడా ఖాయమే.

సుకుమారంగా ఉండే నారా లోకేష్‌ ఓ నాలుగు రోజులు పాదయాత్ర చేసి ఇక చేయలేనని మద్యలో మానేసి ఇంటికి వెళ్ళిపోతే ఆయనతో ఆడేసుకొందామని ఆశగా ఎదురుచూస్తున్న వైసీపీ నేతలకి, 18 రోజులలో 200కిమీ పాదయాత్ర పూర్తిచేసి నారా లోకేష్‌ తమతోనే ఆడేసుకోవడం చూసి షాక్ అవుతున్నారు.

నారా లోకేష్‌ని ఇలాగే 400 రోజులు పాదయాత్ర చేయనిస్తే ఆయన మరింత పరిణతి సాధించి, ఏకు మేకవుతాడనే భయం కూడా వైసీపీ నేతల్లో మొదలై ఉండొచ్చు. అందుకే అప్పుడే మూకుమ్మడిగా ఎదురుదాడులు ప్రారంభించిన్నట్లున్నారు.