Nara-Lokesh-Padayatra-Yuva-Galam_800_Kmsటిడిపి యువనేత నారా లోకేష్‌ అనంతపురం జిల్లాలో శింగనమల నియోజకవర్గంలో 62వ రోజున తన యువగళం పాదయాత్రలో మరో మైలురాయిని అధిగమించారు. నియోజకవర్గంలో మార్తాడు వద్ద 800 కిమీ పాదయాత్ర పూర్తి చేసుకొన్నారు. దీనికి గుర్తుగా మార్తాడు గ్రామంలో నారా లోకేష్‌ శిలాఫలకం ఆవిష్కరించారు. తన సుదీర్గ పాదయాత్రలో బాసటగా నిలుస్తున్న గ్రామస్తులకు కృతజ్ఞతాపూర్వకంగా నారా లోకేష్‌ ఎక్కడికక్కడ హామీలు ప్రకటిస్తున్నారు.

ఏపీలో తమ పార్టీ అధికారంలోకి రాగానే ఆయా మండలాలలో గ్రామస్తులు కోరుకొన్న అభివృద్ధి పనులను చేస్తానని, ప్రతీ 100 కిమీలకు ఒకటి చొప్పున ఆవిష్కరిస్తున్న శిలాఫలకాలపై లిఖితపూర్వకంగా హామీ ఇస్తున్నారు. శింగనమల నియోజకవర్గంలో రైతులు ఎక్కువగా చెరుకు పండిస్తుంటారు కనుక వారి అభ్యర్ధన మేరకు మార్తాడు వద్ద చక్కెర ప్రాసెసింగ్ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తానని హామీ ఇస్తూ నారా లోకేష్‌ శిలాఫలకాన్ని నేడు ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు, హిందూపురం టిడిపి ఎమ్మెల్యే, నారా లోకేష్‌ మావగారు నందమూరి బాలకృష్ణ, ఉరవకొండ టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, ఇంకా పలువురు టిడిపి సీనియర్ నేతలు, వేలాదిగా పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు పాదయాత్రలో నారా లోకేష్‌తో బాటు వారందరూ కలిసి నడిచారు. ఈరోజు ఉదయం పాదయాత్ర మొదలుపెట్టే ముందు నందమూరి బాలకృష్ణ ప్రెస్‌మీట్‌ పెట్టి నారా లోకేష్‌ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో చెప్పారు. సిఎం జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రస్థాయిలో విరుచుకు పడుతూ వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎంతగా నష్టపోతోందో వివరించారు.

నారా లోకేష్‌ జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పంలో యువగళం పాదయాత్ర ప్రారంభించారు. తొలిరోజే నారా లోకేష్‌కు అత్యంత ఆత్మీయుడు, నందమూరి తారకరత్న గుండెపోటుతో కుప్పకూలిపోయి, బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్‌లో నెలరోజులు మృత్యువుతో పోరాడి ఫిభ్రవరి 18వ తేదీన తుదిశ్వాస విడిచారు. ఈ 62 రోజుల పాదయాత్రలో అదే అత్యంత విషాదకరమైన ఘటన.

ఈ 62 రోజుల పాదయాత్రలో రాష్ట్ర రాజకీయాలలో కూడా కొన్ని ఆసక్తికర పరిణామాలు జరిగాయి. ఇటీవల జరిగిన పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలలో ఉత్తరాంద్ర, రాయలసీమ జిల్లాలలో మూడుకి మూడు స్థానాలను టిడిపి గెలుచుకొని వైసీపీకి షాక్ ఇచ్చింది. అలాగే వెంటనే జరిగిన ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా ఒక సీటును గెలుచుకొని మరో పెద్ద షాక్ ఇచ్చింది. ఈ దెబ్బకు నలుగురు ఎమ్మెల్యేలను వైసీపీ నుంచి సస్పెండ్ చేసుకోవలసివచ్చింది. మరో ఏడాదిపాటు శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం వరకు సాగబోయే యువగళం పాదయాత్రలో ఇటువంటి సంఘటనలు మరెన్ని చూస్తామో?