Nara-Lokesh-Padayatra-Yuva-Galam_500Kmsటిడిపి యువనేత నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర ప్రారంభించి అప్పుడే 38 రోజులు పూర్తయ్యాయి. అయినా తొలిరోజు ఎంత ఉత్సాహంగా తొలియాడుగు వేశారో నేటికీ అదే ఉత్సాహంతో ముందుకు సాగిపోతున్నారు. దారి పొడవునా మహిళలు, రైతులు, విద్యార్థులు, ఇంకా వివిద వర్గాల ప్రజలతో మమేకం అవుతూ, వారితో ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతుండటం వలన నారా లోకేష్‌ రోజుకి సుమారు 10కిమీ చొప్పున పాదయాత్ర పూర్తిచేయగలుగుతున్నారు. పది రోజుల క్రితం 31వ రోజున చంద్రగిరి నియోజకవర్గంలో పాకాలమండలం నేండ్రగుంట గ్రామంలో 400కిమీ పాదయాత్ర పూర్తిచేశారు. దానికి గుర్తుగా అక్కడ శిలాఫలకం ఆవిష్కరించి, టిడిపి అధికారంలోకి వచ్చాక అక్కడ 10 పడకల ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేస్తానని నారా లోకేష్‌ హామీ ఇచ్చారు.

నేడు (గురువారం) 39వ రోజున పీలేరు నియోజకవర్గంలో పాదయాత్ర ముగించుకొని పూలవాండ్లపల్లెలో మదనపల్లి నియోజకవర్గంలోకి ప్రవేశించగా మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, టిడిపి నేతలు జయరామనాయుడు, ఖార్ ఖాన్ తదితర టిడిపి నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు ఎదురేగి నారా లోకేష్‌కు పూలదండలు వేసి ఘనస్వాగతం పలికారు.

నేటి యువగళం పాదయాత్రలో మరో గొప్ప విశేషముంది. ఈరోజు మధ్యాహ్నం సిటిఎం-2 పంచాయతీలో నారా లోకేష్‌ 500 కిమీ మైలురాయిని అధిగమించనున్నారు. అక్కడ శిలాఫలకం ఆవిష్కరించి, టిడిపి సీనియర్ నేతలు, స్థానిక గ్రామ పెద్దలు, మహిళల ఆశీర్వాదం తీసుకొంటారు. ఆ తర్వాత స్థానిక ముస్లిం మైనార్టీ ప్రజలతో నారా లోకేష్‌ ముఖాముఖి సమావేశం అవుతారు. ఈరోజు నారా లోకేష్‌ 500 కిమీ మైలురాయి అధిగమించనున్న సందర్భంలో పార్టీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు దేవినేని ఉమా, అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, పార్టీ నేతలు సూర్యప్రకాశ్ నాయుడు, దగ్గుపాటి వెంకేటేశ్వర నాయుడు, ఇంకా యువగళం పాదయాత్ర మీడియా కొ-ఆర్డినేటర్ బివి రాముడు తదితరులు కూడా పాదయాత్ర చేస్తున్నారు.

ఈ మండుటెండల్లో నారా లోకేష్‌ పాదయాత్ర చేయలేరని వైసీపీ ప్రభుత్వం భావించగా, ఇప్పటికే చిత్తూరు, తిరుపతి జిల్లాలో పాదయాత్ర పూర్తి చేసి అన్నమయ్యజిల్లాలో ముందుకు సాగుతున్నారు. వైసీపీ ప్రభుత్వానికి ఈ 500 కిమీ మైలురాయి గుండెల్లో గునపంలా గుచ్చుకొంటున్నా మౌనంగా ఆ బాధని భరించకతప్పడం లేదు పాపం!