Nara_Lokesh_Yuva_Galam_Padayatra_200kmsటిడిపి యువనాయకుడు నారా లోకేష్‌ శనివారం ఉదయం 16వ రోజు యువగళం పాదయాత్రని చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఈరోజు పాదయాత్రలో నారా లోకేష్‌ కతేరపల్లిలో 200 కిమీ పూర్తిచేయబోతున్నారు.

ఈరోజు ఉదయం 8 గంటలకి సింధురాజపురంలో యాదవ సంఘం పెద్దలతో సమావేశమయ్యి వారి సమస్యలని అడిగి తెలుసుకొన్నాక వచ్చే ఎన్నికలలో టిడిపికి మద్దతు ఇవ్వాలని కోరారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో యాదవుల సంక్షేమం కోసం అవసరమైన చర్యలు తీసుకొంటానని హామీ ఇచ్చారు. వారితో సమావేశం ముగిసిన తర్వాత అక్కడే స్థానిక ప్రజలతో కాసేపు ముచ్చటించారు.

ఉదయం 10 గంటలకి రిపుంజయరాజపురంలో చెన్నై నుంచి టిడిపి అభిమానులతో నారా లోకేష్‌ సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికలలో టిడిపికి వారి మద్దతు, సహాయసహకారాలు చాలా అవసరమని అన్నారు. ఉదయం 11.30 గంటలకి కాపు కండ్రిగ చేరుకొని అక్కడ ఎస్టీ సంఘం పెద్దలతో ముఖాముఖి సమావేశంలో పాల్గొంటారు.

మధ్యాహ్నం భోజన విరామ సమయంలో స్థానిక టిడిపి నేతలు,కార్యకర్తలతో సమావేశమయ్యి స్థానిక సమస్యలపై చర్చిస్తారు. భోజన విరామం తర్వాత మధ్యాహ్నం 3.30 గంటలకి కసవరాజపురం అగ్రహారం చేరుకొని, స్థానిక ఎస్సీ నేతలకి పార్టీ కండువాలు కప్పి టిడిపిలోకి ఆహ్వానిస్తారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గం ప్రజలని ఉద్దేశ్యించి నారా లోకేష్‌ ప్రసంగిస్తారు. సాయంత్రం 6.30 గంటలకి కతేరపల్లి 200 కిమీ పాదయాత్ర పూర్తి చేసుకొని రాత్రి అక్కడే బస చేస్తారు.