Nara_Lokesh_YSRCP_Govt_Developmentటిడిపి యువనేత నారా లోకేష్‌ యువగళం పాదయాత్రలో 55వ రోజున గురువారం శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో గుట్టూరు గ్రామంలో 700 కిమీ మైలురాయిని అధిగమించారు. ఈ సందర్భంగా ఆయన పాదయాత్ర చేస్తూనే మీడియాకి చిన్న ఇంటర్వ్యూ ఇచ్చారు.

“సెల్ఫీ విత్ లోకేష్, సెల్ఫీ ఛాలెంజ్… ఈ రెండు కార్యక్రమాలలో మీకు ఏదంటే ఇష్టం?” అని విలేఖరి అడిగిన ప్రశ్నకి నారా లోకేష్‌ సమాధానం చెపుతూ, “నాకు ఈ రెండు కార్యక్రమాలు ఇష్టమే. ఎందుకంటే సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమం ద్వారా నేను సామాన్య ప్రజలను కలిసి వారితో మమేకం కాగలుగుతున్నాను. వారితో ముఖాముఖీ మాట్లాడి వారి సమస్యలను, అవసరాలను తెలుసుకోగలుగుతున్నాను. దీని వలన రేపు మేము అధికారంలోకి వస్తే వారి కోసం ఏమి చేయాలనేదానిపై మాకు మరింత స్పష్టత వస్తోంది. ప్రజలు కూడా టిడిపి తమకు అండగా ఉంటుందనే నమ్మకం ఒందుతున్నారు.

ఇక సెల్ఫీ ఛాలెంజ్ విషయానికి వస్తే, ఇదివరకు మేము అధికారంలో ఉన్నప్పుడు చేసిన అనేక పనులను మేము చెప్పుకోలేక నష్టపోయాము. కనుక ఇప్పుడు ఈ యువగళం పాదయాత్రలో ఆనాడు చంద్రబాబు నాయుడుగారు రాష్ట్రంలో ఎక్కడ ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టారు… ఎక్కడెక్కడ ఎన్ని పరిశ్రమలు తీసుకువచ్చారు… వాటితో నిరుద్యోగ యువత ఏవిదంగా ఉద్యోగాలు, పొందుతున్నారు… మారిన వారి జీవన ప్రమాణాలు వంటివి ఈ సెల్ఫీ ఛాలెంజ్ ద్వారా అందరికీ తెలియజేసే అవకాశం లభిస్తోంది. ఆనాడు మేము ఏమి చేశామో సెల్ఫీల సాక్ష్యంతో ఈ వైసీపీ ప్రభుత్వానికి చూపించి, ఈ నాలుగేళ్ళలో మీరెన్ని పరిశ్రమలు తీసుకువచ్చారు?ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు?అని ప్రజల తరపున నేను ప్రశ్నిస్తునే ఉన్నాను. కానీ ఇంతవరకు నా సెల్ఫీ ఛాలెంజ్‌కి వైసీపీ ప్రభుత్వం నుంచి ఒక్కసారి కూడా సమాధానం రాలేదంటే పరిస్థితి అర్దం చేసుకోవచ్చు,” అని అన్నారు.

“యువగళం పాదయాత్రలో మీరు ప్రధానంగా గమనించిన సమస్య ఏమిటి?” అనే విలేఖరి ప్రశ్నకు, “మొదటిది నిరుద్యోగ సమస్య. రెండోది విచ్చలవిడిగా గంజాయి సరఫరా జరుగుతుండటం గమనించాను. దానిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపి అణచివేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రజలు నిత్యావసర సరకుల ధరల పెరుగుదల, పన్నుల భారంతో చాలా ఇబ్బంది పడుతుండటం గమనించాను. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తాము,” అని నారా లోకేష్‌ చెప్పారు.

యువగళం పాదయాత్ర ద్వారా ప్రభుత్వ విధానాలు, సంక్షేమ పధకాలతో ప్రజలకు నిజంగా మేలు కలుగుతోందా లేదా?లేకపోతే ఏం చేయాలనే విషయం ప్రజలతో ముఖాముఖీ మాట్లాడి తెలుసుకోగలుగుతున్నానని నారా లోకేష్‌ చెప్పారు. ఉదాహరణకి ఇదివరకు తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రజకులకు వాషింగ్ మెషిన్స్ అందజేశాము. కానీ వాటిని వాడితే కరెంట్ బిల్లులు వస్తున్నాయని చాలామంది వాతీ వాడటంలేదని పాదయాత్రలో తెలుసుకొన్నాను. అంటే వాషింగ్ మెషిన్స్ ఇస్తే సరిపోదని వారికి నెలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్‌ కూడా అందించినప్పుడే ఆ పధకం విజయవంతంగా అమలవుతుందనే విషయం తెలుసుకొన్నాను. ఇలాంటి చిన్న చిన్న విషయాలు మేము అధికారంలోకి వచ్చినప్పుడు ప్రభుత్వ విధానాలు, పధకాలను రూపొందించేందుకు చాలా తోడ్పడతాయని భావిస్తున్నాను,” అని నారా లోకేష్‌ చెప్పారు.