టిడిపి యువనేత నారా లోకేష్ నేడు అన్నమయ్య జిల్లా, మదనపల్లి నియోజకవర్గంలో చిన్న తిప్ప సముద్రం-2 వద్ద తన యువగళం పాదయాత్రలో 500 కిమీ మైలురాయి అధిగమించారు. ఈ సందర్భంగా అక్కడ శిలాఫలకం వేయించి, దానిపై రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ గ్రామానికి ఏమేమి చేయాలనుకొంటున్నారో కూడా చెక్కించారు. తద్వారా మాట తప్పితే ప్రజలు వాటిని చూసి తనని నిలదీయవచ్చని నారా లోకేష్ చెప్పడంతో గ్రామస్తులు హర్షధ్వానాలు చేశారు.
రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మదనపల్లిలో టోమెటో ప్రాసెసింగ్ యూనిట్, టొమేటోలు నిలువ చేసుకొనేందుకు ఓ కోల్డ్ స్టోరేజ్, గ్రామంలో పది పడకల ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేస్తానని శిలాఫలకంపై లిఖితపూర్వకంగా నారా లోకేష్ హామీ ఇచ్చారు.
ఆ తర్వాత అక్కడే ఉన్న ‘ఫిష్ ఆంధ్రా స్టాల్’ని చూపిస్తూ నారా లోకేష్ ఓ సెల్ఫీ తీసుకొని, “జగన్ రెడ్డి ఫిష్ ఆంధ్ర ఫినిష్! జగన్ మోహన్ రెడ్డి తెచ్చిన కంపెనీలు చూస్తుంటే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. మొన్ననే దేశంలో ఏడా దొరకని సరుకు జగన్ తయారు చేసే బూమ్ బూమ్, ఆంధ్రా గోల్డ్, ప్రెసిడెంట్ మెడల్ లోడు మీకు చూపించాను. ఈ రోజు మరో జగన్ బ్రెయిన్ చైల్డ్ స్కీమ్ ‘ఫిష్ ఆంధ్ర’ చూశాను,” అంటూ నారా లోకేష్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
నారా లోకేష్ ఊరికే విమర్శించలేదు. లేడికి లేచిందే పరుగు అన్నట్లు రాష్ట్ర ప్రభుత్వ అధ్వర్యంలో మద్యం దుకాణాలు విజయవంతంగా నడుస్తున్నాయి కనుక, మటన్, చికెన్, ఫిష్ దుకాణాలు కూడా నిర్వహించేందుకు సిద్దపడిపోయింది. అయితే మద్యం వ్యాపారం వేరు, ఈ మాంసాహార ఉత్పత్తుల వ్యాపారం వేరేలా ఉంటుందని గ్రహించకుండా హడావుడిగా ఎక్కడికక్కడ ‘ఫిష్ ఆంధ్రా’ దుకాణాలు తెరిపించేశారు. కానీ వాటిని తెరిచిందీ లేదు. తెరిచిన కొన్నీ కూడా కొద్దిరోజులకే మూసుకుపోయాయి. కానీ వాటిపై ప్రభుత్వం పెట్టిన ఖర్చు, వాటి ప్రచారం కోసం చేసిన ఖర్చు అంతా దండగైపోయింది. టిడిపి ప్రభుత్వం హయాంలో తెచ్చిన పరిశ్రమలు నేటికీ నడుస్తున్నాయని నారా లోకేష్ సెల్ఫీలు తీసుకొని చూపిస్తున్నారు. కానీ జగన్ ప్రభుత్వం ప్రారంభించిన ‘ఫిష్ ఆంధ్రా’ మాత్రం అప్పుడే ఫినిష్ అయిపోయింది… అంటూ తాళం వేసున్న ఆ ‘ఫిష్ ఆంధ్రా’ దుకాణాన్నే నారా లోకేష్ చూపించి ఎద్దేవా చేశారు.