Nara_Lokesh_Womens_Day2023టిడిపి యువనేత నారా లోకేష్‌ నేడు పీలేరు నియోజకవర్గంలో 38వ రోజు యువగళం పాదయాత్ర కొనసాగిస్తున్నారు. దారిలో బోయపల్లి క్రాస్ రోడ్స్ వద్ద స్థానిక మహిళలతో ముఖాముఖి సమావేశంలో మాట్లాడుతున్నప్పుడు అశోక్ కుమార్‌ అనే ఓ వైసీపీ కార్యకర్త భార్య వచ్చి చెప్పిన విషయాలు విని అందరూ ఆశ్చర్యపోయారు.

“మాది చింతలవారిపల్లె. నా భర్త అశోక్ కుమార్‌ గ్రామ సర్పంచ్‌గా ఉండేవారు. మేము మొదటి నుంచి వైసీపీలోనే ఉన్నాము. కనుక జగనన్న పాదయాత్ర చేసినప్పుడు నా భర్త ఆయన వెంటవెళ్ళి బ్యానర్లు కడుతున్నప్పుడు ప్రమాదానికి గురయ్యి మంచానపడ్డాడు. అప్పుడు మేము మా పార్టీ నేతలకి ఎన్నిసార్లు మొరపెట్టుకొన్నా ఎవరూ మమ్మల్ని ఆదుకోలేదు. కానీ టిడిపికి చెందిన కిషోరన్నను కలిసి మా గోడు చెప్పుకొంటే, ఆయన చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ప్రభుత్వం నుంచి మాకు 30 లక్షలు ఇప్పించారు. దాంతోనే చికిత్స చేయించుకొని నా భర్తను బ్రతికించుకొన్నాను. ఇందుకు మేమిద్దరం చంద్రబాబు నాయుడుకి, టిడిపికి ఎప్పటికీ ఋణపడి ఉంటాము,” అని చెప్పి ఆ మహిళ తన భర్తను వేదిక వద్దకు తీసుకువచ్చి అందరికీ పరిచయం చేసింది.

దీనిపై నారా లోకేష్‌ స్పందిస్తూ, “వైసీపీలో పనిచేస్తున్నవారి పరిస్థితి ఇలాగ ఉంటుంది. ఈ అమ్మ వైసీపీకి చెందినదే అయినా, ఆ పార్టీ కోసం పనిచేస్తూ ప్రమాదానికి గురైనా, టిడిపికి చెందిన కిషోర్ ఆమెకు ఓ అన్నలా అండగా నిలబడి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి సిఎం రిలీఫ్ ఫండ్ నుంచి వారికి 30 లక్షలు ఇప్పించారు.

మా పార్టీ, మా అధినేత చంద్రబాబు నాయుడు పార్టీలు, కులమతాలు, ప్రాంతాలని చూడకుండా రాష్ట్ర ప్రజలందరినీ సమానంగా చూస్తారని చెప్పేందుకు ఈ దంపతులే ఓ నిదర్శనంగా నిలుస్తున్నారు. కానీ సిఎం జగన్మోహన్ రెడ్డి, ఆయన ప్రభుత్వం తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ సమాజాన్ని కులమతాలు, ప్రాంతాల పేరుతో నిలువునా చీల్చేస్తున్నారు.

చంద్రబాబు నాయుడు పాలనలో గ్రామాలలో ఏనాడూ ప్రజల మద్య గొడవలు ఉండేవి కావు. అందరూ హాయిగా కలిసిమెలిసి జీవించేవారు. మనం ఏ పార్టీలకు చెందినవారమైనా ముందుగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలమని అందరం గుర్తుంచుకోవాలి. ఎన్నికలకు మూడు నెలల ముందు ఎవరి పార్టీల కోసం వారు పనిచేసుకొందాము. అప్పుడు ఒకరినొకరు విమర్శించుకొందాము కానీ ఎన్నికల పూర్తవగానే మళ్ళీ ఎన్నికలు వచ్చే వరకు అందరం ఓ కుటుంబ సభ్యులులాగ కలిసి మెలిసి జీవిద్దాము,” అని నారా లోకేష్‌ హితవు పలికారు.