Nara-Lokesh-with-youth-in-Yuvagalamటిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ బుదవారం జిడి నెల్లూరు నియోజకవర్గంలో 13వ రోజు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా కృష్ణాపురంలో యువతీయువకులతో నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడుతున్నప్పుడు సచివాలయంలో పనిచేస్తున్న ఓ యువకుడు నారా లోకేష్‌ని ఓ ప్రశ్న అడిగాడు. “అన్నా టిడిపి అధికారంలోకి వస్తే సచివాలయాలు మూసేస్తుందని, ఉద్యోగులని తీస్తుందని పుకార్లు వినిపిస్తున్నాయి. నిజమేనా?అని ప్రశ్నించారు.

ఇది ప్రభుత్వ విధానపరమైన అంశం గనుక చాలా ఇబ్బందికరమైన ప్రశ్నే అని చెప్పవచ్చు. సచివాలయాల కోసం వైసీపీ ప్రభుత్వం వేలకోట్లు ఖర్చు పెట్టింది. వేలాదిమంది ఉద్యోగులని నియమించింది. ప్రభుత్వంలో రెవెన్యూ, మునిసిపల్ శాఖలు, వాటిలో వేలాదిమంది ఉద్యోగులు పనిచేస్తుండగా వాటికి సమాంతరంగా ఈ సచివాలయ వ్యవస్థని సృష్టించడం ద్వారా వారి సేవలు పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోతోంది. సచివాలయాలకి రెవెన్యూ, మున్సిపల్ కార్యాలయాల మద్య పని విభజన కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. సచివాలయాల వలన రాష్ట్ర ప్రభుత్వంపై భారీగా అదనపు ఆర్ధికభారం పడుతోంది.

వైసీపీ నేతలకి తమ పార్టీ అవసరాల కోసం ఓ నిరర్ధక వ్యవస్థని సృష్టించామని బాగా తెలుసు. ప్రభుత్వ ఖజానా నుంచి లక్షలాది వాలంటీర్లకి జీతాలు చెల్లిస్తూ వారిని వైసీపీ కార్యకర్తలుగా వినియోగించుకోంటోంది. అందుకే టిడిపి అధికారంలోకి వస్తే సచివాలయ వ్యవస్థలని రద్దు చేస్తుందని ప్రచారం చేస్తున్నారు. టిడిపి వస్తే ముందుగా మీ అందరినీ ఉద్యోగాలలో నుంచి తొలగిస్తుందని, కనుక టిడిపి అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు వంటివారు సచివాలయ సిబ్బందికి, వాలంటీర్లకి నూరిపోస్తున్నారు.

ఈ నేపధ్యంలో ఆ యువకుడు అడిగిన ప్రశ్నకి నారా లోకేష్‌ చెప్పిన సమాధానం ఆయన రాజకీయ పరిణతికి అద్దం పట్టింది. “నిజం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది. అబద్దాలు తీయగా ఉంటాయి. ఈసారి ఎన్నికలలో ఓడిపోతామని ముందే గ్రహించిన సిఎం జగన్మోహన్ రెడ్డి అబద్దాలు చెప్పి అందరినీ నమ్మించి మళ్ళీ అధికారంలోకి రావాలని కలలు కంటున్నారు. అందుకే మేము అధికారంలోకి వస్తే సచివాలయ ఉద్యోగులని తొలగించేస్తామని అబద్దాలు చెపుతూ మిమ్మల్ని భయపెడుతున్నారు. ప్రభుత్వ నోటిఫికేషన్‌ ద్వారా మీరందరూ ఈ ఉద్యోగాలకి ఎంపికైనప్పుడే మీరు కూడా ప్రభుత్వోద్యోగులయ్యారు. మరి మిమ్మల్ని ఎవరైనా ఏవిదంగా తొలగించగలరు?మేము అధికారంలోకి వస్తే సచివాలయాలు మూయబోము. ఎవరినీ ఉద్యోగాలలో నుంచి తొలగించబోము. అయితే జగన్మోహన్ రెడ్డి ఈ అనాలోచిత నిర్ణయంతో రాష్ట్రంలో మీసేవా కేంద్రాలన్నీ మూతపడేలా చేశాడు. మీసేవలో లభించే సేవలన్నీ సచివాలయాలలో అందించలేకపోతున్నారు. కనుక మేము అధికారంలోకి వస్తే సచివాలయాలని యధాతధంగా కొనసాగిస్తూనే, వాటిలో మరిన్ని సేవలు లభించేలా మరింత మెరుగుపరుస్తాము,” అని చెప్పారు.

గ్రామ సర్పంచ్‌ మొదలు ప్రధాని వరకు అందరూ కళ్ళలో సూటిగా చూసి మాట్లాడుతుంటారని కానీ సిఎం జగన్మోహన్ రెడ్డికి అబద్దాలు చెప్పే అలవాటున్నందున మండలిలో సూటిగా తన కళ్ళలో చూసి మాట్లాడలేక కాళ్ళవైపు చూస్తూ మాట్లాడుతారని నారా లోకేష్‌ ఎద్దేవా చేశారు.