Nara Lokesh versus kannababuవివేకా హత్య కేసు వైఎస్సార్ కాంగ్రెస్ వారు డిఫెన్స్ లో పడుతున్నారు. ఎన్నికల ముందు టీడీపీ మీదకు ఆ కేసుని నెట్టే ప్రయత్నం చేసినా వివేకా కుమార్తె ఇది ఇంటి దొంగల పనే అని పదే పదే చెప్పడంతో ఆ పార్టీ ఇరుకున పడింది. పైగా… అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఆ కేసులో పురోగతి లేకపోవడంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి.

అధికార పార్టీని ఇబ్బంది పెడుతూ… వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో తమకు సంబంధం లేదని ప్రమాణం చేస్తామని, అదే రీతిలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తమకేమీ సంబంధం లేదని ప్రమాణం చేయగలరా? అంటూ నారా లోకేష్ సవాలు విసిరారు. అన్న ప్రకారమే లోకేష్ ప్రమాణం కూడా చేసి వచ్చారు.

ఆ తరువాత మంత్రి కన్నా బాబు మాట్లాడుతూ… ఎన్టీఆర్‌కు మీ నాన్న చంద్రబాబు వెన్నుపోటు పొడవలేదని ప్రమాణం చేస్తావా? బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరగలేదని చేస్తావా? పుష్కరాలలో ఎవరూ చనిపోలేదని చేస్తావా? అంటూ పొంతన లేకుండా మీడియా ముందు సుదీర్ఘ ప్రసంగాలు చేసేశారు. ఆయా కేసులలో కొత్తగా మాట్లాడాల్సింది ఏముంది?

లోకేష్ ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి ప్రమాణాలు అని అడుగుతున్నాడు. ఆయా విషయాలలో ఇంకా ప్రజలకు తెలియాల్సింది ఏమైనా ఉంటే అధికారంలో ఉన్న వారు ఆ కేసులను రీ-ఓపెన్ చేసుకోవచ్చు కదా? ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి లోకేష్, 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న వ్యక్తి జగన్. క్యాడర్ లేని వ్యక్తి పిలిస్తే సీఎం వైఎస్‌ జగన్ రావాలా? అని మరో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి చెప్పుకొచ్చారు. అలా అయితే రెండేళ్ల క్రితం జగన్ కూడా ప్రతిపక్షంలోనే ఉన్నారుగా? వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ కూడా ఎన్నికలలో ఓడిపోయినవారే కదా? ఏంటో ఏమో!