Nara Lokesh RRR‘భీమ్లా నాయక్’ విడుదలకు ఏపీ సర్కార్ పెట్టిన ఆంక్షలు, తలపెట్టిన ఆటంకాలు తెలియనివి కావు. అయితే ఇదంతా పేదవాడి వినోదం కోసమే అని చెప్తూ చేసిన హంగామాకు, నారా లోకేష్ కౌంటర్లతో విరుచుకుపడిన వైనం తెలిసిందే. దీంతో ఏదైనా జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు ట్వీట్ చేసారా? కేవలం ఇది రాజకీయ లబ్ది కోసమేనని వైసీపీ కూడా కౌంటర్ వ్యాఖ్యలు చేసింది.

అయితే ఆ రోజు రానే వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ నటించిన “ఆర్ఆర్ఆర్” సిల్వర్ స్క్రీన్ ను తాకి షేక్ చేస్తున్న నేపధ్యంలో నారా లోకేష్ నుండి ట్వీట్ వచ్చింది. “ఆర్ఆర్ఆర్”పై అద్భుతమైన రివ్యూలను వింటున్నానని, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అండ్ రాజమౌళిలకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నానని అన్నారు.

ఖచ్చితంగా ఈ సినిమాను తన కుటుంబ సభ్యులందరితో కలిసి చూస్తానని, అన్ని రికార్డులను కొల్లగొట్టాలని ఆశిస్తున్నట్లుగా నారా లోకేష్ పేర్కొన్నారు. లోకేష్ అన్నట్లు నిజంగానే సూపర్ రివ్యూస్ అండ్ బ్లాక్ బస్టర్ టాక్ తో ‘ఆర్ఆర్ఆర్’ ఓపెన్ అయ్యింది. సహజంగా సినిమా చూసిన తర్వాత తమ అనుభూతులను పంచుకోవడం సెలబ్రిటీలు అండ్ పొలిటిషిన్ల స్టైల్.

కానీ అందుకు విరుద్ధంగా ‘టాక్’ గురించి కూడా ప్రత్యేకంగా ఓ ట్వీట్ లో పేర్కొన్నారంటే, ఇది వైసీపీకి కౌంటర్ ఎటాక్ లో భాగమేనని సినీ, పొలిటికల్ వర్గాలు భావిస్తున్నాయి. సినిమా బాగుంటే చూస్తాము, లేదంటే చూడము అంటూ చెప్పిన లోకేష్, ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ రావడంతో, ఈ ముందస్తు ట్వీట్ అని, బహుశా సినిమా చూసిన తర్వాత మరో ట్వీట్ వేస్తారేమో!

ఏది ఏమైనా వైసీపీ ఆశించిన ట్వీట్ అయితే వచ్చింది. ఇది మాత్రం వైసీపీకి రుచించక పోవచ్చు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ – నారా కుటుంబాల నడుమ విభేదాలు వచ్చే విధంగా వ్యాఖ్యలు చేయడంలో వైసీపీ నేతలు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. మరి దీనికి వైసీపీ నుండి ఎలాంటి కౌంటర్లను సిద్ధం చేస్తారో చూడాలి.