Nara Lokesh tweets Kotamreddy Sridhar Reddy call recordingsనారా లోకేష్ రెండు రోజులుగా ట్విట్టర్ వేదికగా అధికార పక్షంపై విరుచుకుపడుతున్నారు. ఈరోజు నిజాయితీకే సిగ్గుచేటు అన్నవిధంగా అక్రమాస్తుల కేసులో ఏ1 గారు అవినీతిపై క‌మిటీ వేశారని… ఏ2 విజ‌య‌సాయిరెడ్డిగారు విచార‌ణ చేస్తార‌ట‌ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అదే క్రమంలో నెల్లూరు రురల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక జర్నలిస్టును ఫోన్ లో బెదిరిస్తున్న ఆడియో క్లిప్ ను లోకేష్ ట్విట్టర్ లో విడుదల చేశారు. ఇప్పుడు అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ ఆడియోలో నడిరోడ్డుపై నరికేస్తానంటూ అసభ్య పదజాలంతో ఎమ్మెల్యే రెచ్చిపోయారు. ఇదంతా కేవలం సదరు జర్నలిస్టు ఎమ్మెల్యేను విమర్శిస్తూ రాసినందుకే… ఆడియోలో కోటంరెడ్డి పలుమార్లు రికార్డు చేసుకో కావాలంటే… సోషల్ మీడియాలో పెట్టుకో నాకేమీ నష్టం లేదంటూ రెచ్చిపోవడం విశేషం. ఆడియోలో ఉన్న గొంతు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిదా కాదా అన్నది తేలాల్సి ఉంది. అయితే గొంతు మాత్రం వినడానికి అచ్ఛం ఆయన గొంతులానే ఉంది.

ఒకవేళ ఆయనదే అయితే వైఎస్సాఆర్ కాంగ్రెస్ నాయకులకు అధికార మదం తలకు ఎక్కింది అనే విమర్శలు రావడం ఖాయం. ముఖ్యమంత్రి జగన్ మంత్రులు, ఎమ్మెల్యేల సహా ఎవరు తప్పు చేసినా ఉపేక్షించేది లేదని కుండబద్దలు కొట్టేశారు. శాంతిభద్రతల విషయంలోనూ రాజీ లేదని పోలీసులకు చెప్పేశారు. ఒకవేళ ఆ గొంతు ఎమ్మెల్యేదని తేలితో.. ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, ఏవైనా చర్యలు తీసుకుంటుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది.