Nara_Lokesh_Thopudurthi_Prakash_Reddyటిడిపి యువనేత నారా లోకేష్‌ శ్రీసత్యసాయి జిల్లా, రాప్తాడు నియోజకవర్గంలో యువగళం 57వ రోజు పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. “నియోజకవర్గం అభివృద్ధి చేయడంలో తోపు కాదుగానీ అవినీతి, అక్రమాలలో ప్రకాష్ రెడ్డి నిజంగా తోపే. గత ఎన్నికలలో ఖర్చు పెట్టడానికి నా దగ్గర నయాపైసా లేదని చెప్పుకొన్న తోపుదుర్తి ఈ నాలుగేళ్ళలో రూ.1,000 కోట్లు ఎలా సంపాదించగలిగారు? నేను పాదయాత్ర చేస్తుంటే దారి పొడవునా ఈ ఎమ్మెల్యే కుటుంబానికి చెందిన ఇసుక లారీలే కనిపించాయి. ఇన్ని ఇసుక లారీలను ఎలా కొన్నారు?

నియోజకవర్గం అభివృద్ధి చేయకపోయినా ఆ పేరుతో ఎమ్మెల్యే, ఆయన తండ్రి, సోదరులు అందరూ కలిసి దోచుకొంటున్నారు. నియోజకవర్గానికి ఒక్కరే ఎమ్మెల్యే అయినప్పటికీ, ఆయన కుటుంబ సభ్యులందరూ ఎమ్మెల్యేలన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. స్థానికంగా పోలీస్ అధికారులను అడ్డంపెట్టుకొని రైతులను రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించి తోపులా కుటుంబం భూములు కబ్జాలు చేస్తోంది. ఇక్కడే కాదు…విశాఖలో కూడా వీళ్ళు భూములు కబ్జాలు చేస్తున్నారు. రాక్రీట్ పేరుతో రూ.280 కోట్లు ప్రజాధనం స్వాహా చేసినమాట వాస్తవమా కాదా? అని నేను అడుగుతున్నాను.

మా ప్రభుత్వం అనంతపురానికి జాకీ కంపెనీని తీసుకువస్తే ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరులు వారిని రూ.17 కోట్లు ఇవ్వాలని పీడించడంతో వీరి వేధింపులు తట్టుకోలేక జాకీ కంపెనీ తెలంగాణకు తరలివెళ్ళిపోయింది. రాప్తాడును మరో కోనసీమలా చేస్తానని ఆనాడు ప్రగల్భాలు పలికారు కదా? రాప్తాడు ఇంకా అలాగే ఉందేమిటి?

మా తాత ఎన్టీఆర్‌, మా తండ్రిగారు చంద్రబాబు నాయుడు, మా మావయ్య బాలకృష్ణ, అనంతపురం జిల్లా అభివృద్ధి కోసం చేసిన పనులే కనబడుతున్నాయి తప్ప వైసీపీ పాలనలో ఒక్క పని కూడా జరగలేదు. కానీ ఇసుక దోపిడీ, ప్రజాధనం దోపిడీ మాత్రం యధేచ్చగా చేసుకొంటున్నారు,” అని నారా లోకేష్‌ మండిపడ్డారు.