Nara Lokesh's Surprise to TDP Supporters on Social Mediaఅధికారంలో ఉండగా సోషల్ మీడియాని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది తెలుగుదేశం పార్టీ. దానికి తగిన మూల్యం చెల్లించుకుంది కూడా. అదే సమయంలో ప్రశాంత్ కిషోర్ సాయంతో అప్పటి ప్రభుత్వంపై ఉన్నదీ లేనిదీ ప్రచారం చేసి వైఎస్సార్ కాంగ్రెస్ లాభపడింది. అధికారం పోయాక సోషల్ మీడియా మీద దృష్టిపెట్టింది టీడీపీ. నారా లోకేష్ స్వయంగా రంగంలోకి దిగారు. ఈరోజు వైఎస్సార్ కాంగ్రెస్ కు మద్దతుగా ఎక్కువగా టీడీపీ మీద బురద జల్లే ఒక వెబ్ సైట్ మీద లోకేష్ విరుచుకుపడ్డారు.

అసలు విషయానికి వస్తే… సాహూ ఇంటర్వ్యూలో ఏపీ కొత్త ముఖ్యమంత్రి జగన్ గురించి అడగ్గా… “పాలిటిక్స్ గురించి నాకు పెద్దగా అవగాహన లేదు. అయితే యంగ్ సీఎంగా ఆంధ్రప్రదేశ్‌ను జగన్ అభివృద్ధి పథంలో నడిస్తారనే నమ్మకమైతే ప్రజల్లో ఉంది. జగన్ బాగా పనిచేస్తున్నారనే అనుకుంటున్నా అని కర్రా విరక్కుండా పాము చావకుండా సమాధానం చెప్పాడు ప్రభాస్. సదరు వెబ్ సైట్ దీనికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహించి సోషల్ మీడియాలో సాహో మీద దుమ్మెత్తి పొయ్యమన్నారని ఒక వార్త వండి వార్చారు.

“ఇంకా ఎంత దిగజారతారు? సిగ్గుపడండి జర్నలిజం ముసుగులో ఇటువంటి తప్పుడు రాతలు రాయడానికి. కులాల మధ్య కుంపట్లు రగిల్చి, ఒక్కొక్కరి మధ్య ద్వేషాన్ని రగిలించి అటువంటి డబ్బుతో ఎలా అన్నం తింటున్నారు? అసలు మీకు మనస్సాక్షి అనేది ఉందా?,” అని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు లోకేష్. “ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు నేను కూడా సాహో కోసం వేచి చూస్తున్నా.. సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా… టీడీపీ అభిమానులను ఈ సినిమా చూసి ఇటువంటి తప్పుడు రాతలను తిప్పికొట్టామని కోరుతున్నా,” అన్నారు లోకేష్. మాములుగా ఇది చిన్న విషయం అయితే సోషల్ మీడియా విషయంలో టీడీపీ రిస్కు తీసుకోదల్చుకోలేదు. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టే ప్రయత్నం చేస్తుంది.