Nara-Lokesh-Balija-Communityటిడిపి యువనేత నారా లోకేష్‌ ఆదివారం మైదుకూరు నియోజకవర్గంలో 116వ రోజు యువగళం పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా భూమయ్యగారి విడిది పల్లెలో బలిజ సంఘం నేతలతో ముఖాముఖీ సమావేశం అయినప్పుడు, వారు తమ సామాజికవర్గానికి మరిన్నిటికెట్స్ ఇవ్వాలని కోరారు. వారికి నారా లోకేష్‌ చెప్పిన సమాధానం ఆయన రాజకీయ పరిణతిని సూచిస్తోంది.

“ముందుగా నేను మిమ్మల్ని ఓ ప్రశ్న అడుగుతాను. 2019 ఎన్నికలలో రాజంపేట ఎంపీ టికెట్‌ మీ సామాజిక వర్గానికి చెందిన రత్నప్రభకు ఇచ్చాము. కానీ ఆమెను మీరు గెలిపించుకోలేదు. తర్వాత జిల్లాస్థాయిలో ఆమెకు అవకాశం ఇస్తే అప్పుడూ ఆమెను మీరు గెలిపించుకోలేదు.

ఆమెపై ఎటువంటి అవినీతి ఆరోపణలు లేవు. ఆమె లక్షల మందికి అన్నం పెట్టే అన్నపూర్ణ అని మీరే చెపుతున్నారు. అందుకే చిత్తూరు ఎమ్మెల్యేగా ఉన్న ఆమెను పార్లమెంటుకు పంపితే బాగుంటుందని చంద్రబాబు నాయుడు భావించి, గత ఎన్నికలలో ఆమెకు రాజంపేట టికెట్‌ ఇచ్చారు. కానీ ఆమెను మీరు గెలిపించుకోలేదు.

టిడిపి ఎప్పుడూ అన్ని కులాలవారికి సమానాకాశాలు కల్పిస్తూనే ఉంటుంది. కానీ ఆ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోవాలి కదా?మీ అందరి తరపున నిలబెట్టిన వ్యక్తిని మీ మనిషిని మీరు గెలిపించుకొన్నట్లయితే, ఆ తర్వాత మీరు ఎన్ని కోరినా ఇచ్చేందుకు టిడిపి సిద్దంగా ఉంది.

2019 ఎన్నికలలో మీరు పాలిచ్చే ఆవు వంటి టిడిపిని కాదని కాలితో తన్నే దున్నపోతు వంటి వైసీపీని తెచ్చిపెట్టుకొన్నారు. అప్పుడు మేము మాత్రం ఏం చేయగలం?

వచ్చే ఎన్నికలలో కూడా రత్నప్రభతో సహా మరికొందరు బలిజ సోదరులకు టికెట్స్ కేటాయిస్తాము. కానీ వారిని గెలిపించుకొనే బాధ్యత మీదే. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు టిడిపి కట్టుబడి ఉంది. ఉంటుంది. గతంలో టిడిపి ప్రభుత్వం మీకు ఇచ్చినవాటిని వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని మీరే చెపుతున్నారు. మీకు మేలు చేస్తున్నది ఎవరో.. మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నది ఎవరో మీకే తెలుసు. కనుక వచ్చే ఎన్నికలలో టిడిపి తరపున నిలబెట్టబోతున్న మీ సామాజికవర్గానికి చెందిన అభ్యర్ధులను గెలిపించుకొనే బాధ్యత పూర్తిగా మీదే. మీరు వారిని గెలిపించుకొంటే వారి ద్వారా మీ అందరికీ న్యాయం జరుతుంది,” అని నారా లోకేష్‌ అన్నారు.