Nara_LOkesh_Tarakaratnaనందమూరి కుటుంబం నుంచి మరొకరు రాజకీయాలలో ప్రవేశించే సూచనలు కనిపిస్తున్నాయి. నందమూరి మోహనకృష్ణ కుమారుడు తారకరత్న మంగళవారం హైదరాబాద్‌లో నారా లోకేష్‌తో భేటీ అయ్యారు. తారాకరత్న కూడా ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొవాలనుకొంటున్నట్లు ఇది వరకే చెప్పారు. కనుక వచ్చే ఎన్నికలలో టిడిపి అభ్యర్ధిగా శాసనసభకి పోటీ చేయడం ఖాయమే. ఆయన నారా లోకేష్‌తో భేటీ అయ్యి ఏపీలో పోటీ చేసేందుకు అవకాశం ఇమ్మనమని కోరిన్నట్లు తెలుస్తోంది. నారా, నందమూరి కుటుంబాల మద్య బంధుత్వం ఉన్నందున వారు యదాలాపంగా కలిసిన్నట్లు చెప్పుకొన్నప్పటికీ తారకరత్న పోటీ చేయడం గురించే ప్రధానంగా చర్చించుకొన్నట్లు తెలుస్తోంది. తారకరత్నకి టిడిపి టికెట్‌ ఇస్తుందో లేదో అనేది తర్వాత తెలుస్తుంది కానీ తారకరత్న, నారా లోకేష్‌ భేటీతో నందమూరి కుటుంబానికి, చంద్రబాబు నాయుడుకి మద్య దూరం పెరిగిందని సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారానికి చెక్ పెట్టిన్నట్లయింది.

ఇక తారకరత్నకి టికెట్‌ లభిస్తుందా లేదా అనే ప్రశ్నకి ముందు ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల గురించి చెప్పుకోవలసి ఉంటుంది. వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలోని 175 స్థానాలు గెలుచుకొంటామని సిఎం జగన్మోహన్ రెడ్డి చెపుతుండటమే కాక టిడిపికి బాగా బలం ఉన్న ప్రతీ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించి అక్కడ వైసీపీని గెలిపించుకొనేందుకు అప్పుడే పావులు కదుపుతున్నారు. కనుక వచ్చే ఎన్నికలలో ప్రతీ నియోజకవర్గంలో టిడిపి, వైసీపీల మద్య భీకరమైనపోరు జరుగబోతోంది. జనసేన కూడా టిడిపితో పొత్తులకి ఆసక్తి చూపుతోంది కనుక దానికీ కొన్ని సీట్లు కేటాయించవలసి ఉంటుంది. ఇక వచ్చే ఎన్నికలలో తెలంగాణ సిఎం కేసీఆర్‌ నేతృత్వంలో బిఆర్ఎస్‌ పార్టీ కూడా ఏపీలో పోటీ చేయబోతోంది. కనుక వచ్చే ఎన్నికలలో పార్టీల మద్య ఓట్లు చీలిపోతే దేనికీ భారీ మెజార్టీ లభించకపోవచ్చు. ఈ పరిస్థితులలో ప్రతీ ఒక్క సీటు చాలా కీలకంగా మారుతుంది. కనుక ఈ పరిస్థితులలో తొలిసారిగా ఎన్నికల బరిలో దిగాలనుకొంటున్న తారకరత్నతో చంద్రబాబు నాయుడు ప్రయోగం చేసేందుకు అంగీకరిస్తారో లేదో చూడాలి.