Nara Lokesh Strong counter to Ys Jagan    సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ప్రసంగాలలో ప్రతీ వాక్యానికి ముందు తర్వాత ‘మన ప్రియతమ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి’ అనే పదాలు తప్పనిసరిగా వినిపించేవి. ఎందుకంటే అప్పుడు అవసరం అలాంటిది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పదాలు వినిపించడం లేదు. తల్లి, చెల్లీ కూడా పక్కన కనిపిచడం లేదిప్పుడు. అది వేరే సంగతి.

అధికారంలోకి వచ్చాక జగన్ ప్రసంగాలలో తరచూ వినిపిస్తున్న మాట ‘దేవుడి స్క్రిప్ట్.’ దానిని టిడిపిని, దాని అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించడానికి ఆయన ఎక్కువగా వాడుతుంటారు. కానీ ఈసారి ఆ దేవుడి స్క్రిప్ట్ గురించి టిడిపికి మాట్లాడే అవకాశం లభించింది.

టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ స్పందిస్తూ, “ఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చాడు… తన పార్టీకి తానే అధ్యక్షుడు కాకుండా పోయాడు… రెండూ ఒకే రోజు… దేవుడి స్క్రిప్ట్. జగన్ రెడ్డి భవిష్యత్‌ ఏమిటో…” అంటూ ట్వీట్ చేస్తూ, కిందన ఎన్నికల కమీషన్‌ లేఖను జోడించారు. దానిలో వైసీపీ శాస్విత అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి నియామకం చెల్లదంటూ ఎన్నికల కమీషన్‌ స్పష్టంగా పేర్కొంది. ప్రజాస్వామ్య విధానంలో ఇటువంటి వాటికి తావు లేదని తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించి అధ్యక్షుడుని ఎన్నుకోవాలని సూచించింది.

నిన్న శాసనసభలో ఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చుతున్నట్లు సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన రోజునే, వైసీపీ శాశ్విత అధ్యక్షుడిగా ఆయన ఎంపిక చెల్లదని కేంద్ర ఎన్నికల కమీషన్‌ లేఖ విడుదల చేయడం దేవుడి స్క్రిప్ట్ కాకపోతే మారేమిటి?