Nara_Lokesh_Yuva_Galam_Padayatra_TDP_Day9టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర 9వ రోజున పూతలపట్టు నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకి వెంకటగిరిలో బీసీ వర్గం ప్రజలతో సమావేశమయ్యారు. తర్వాత ముత్తుకూరులో మామిడి రైతులతో మాట్లాడి వారి సమస్యలని అడిగి తెలుసుకొన్నారు. ఉదయం 11.30 గంటలకి సదాకుప్పంలో ఎస్సీ, ఎస్టీ సాంజిక వర్గానికి చెందిన పెద్దలు, యువతతో సమావేశమై వారి సమస్యలని అడిగి తెలుసుకొన్నారు. మధ్యాహ్నం 12.30కి పైమఘం వద్ద వడ్డెర సంఘం పెద్దలని కలిసి వారి ఆశీర్వాదం తీసుకొన్నారు.

తర్వాత అక్కడే మహిళలతో ముచ్చటించారు. డ్వాక్రా సంఘాలు, సంక్షేమ పధకాలలో ప్రతీ ఒక్కరికీ డబ్బులు వస్తున్నాయా లేదా అని అడిగినప్పుడు చాలా మంది మహిళలు తమకి అందడం లేదని, ఏమంటే టిడిపిలో తిరుగుతున్నావనో లేదా మరో కారణమో చెప్పి పంపించేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు పాదయాత్రలో చివరిగా సాయంత్రం 5.30 గంటలకి ఎగువ తడకర చేరుకొన్నారు. అక్కడ గ్రామస్తులు నారా లోకేష్‌కి ఘనస్వాగతం పలికారు. వారితో ముచ్చటించి గ్రామ పెద్దల ఆశీర్వాదం తీసుకొన్నారు.

యువగళం పాదయాత్రలో నారా లోకేష్‌కి అపూర్వమైన ప్రజాధారణ లభిస్తుండటంతో అందరితో మాట్లాడుతూ చాలా సంతోషంగా ముందుకు సాగుతున్నారు. నారా లోకేష్‌ పాదయాత్రలో నానాటికీ రాటు తేలుతున్నట్లు ఆయన మాటలలో స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు మాట్లాడటానికి చాలా తడబడే నారా లోకేష్‌ ఇప్పుడు అలవోకగా మాట్లాడుతుండటమే కాక, వైసీపీ ప్రభుత్వం, సిఎం జగన్మోహన్ రెడ్డిలని ఉద్దేశ్యించి చురకలు వేస్తుంటే ప్రజలు కూడా హాయిగా నవ్వుకొంటున్నారు. వాటిలో కొన్ని…

“మన కార్పొరేషన్ల సెటప్ చూసి అబ్బా… వీడు అమరావతి కంటే తోపు తూరుంరా… అనుకొంటాము. కానీ లోపలకి వెళ్తే కూర్చోవడానికి కుర్చీలు ఉండవు… బల్లలు ఉండవు. కనుక వాళ్ళు ఎలా పనిచేస్తున్నారో అర్దం చేసుకోవచ్చు. ఇంతకీ మీ కార్పొరేషన్ ఛైర్మన్‌లని నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. ఈ మూడున్నరేళ్ళలో మీరు బీసీలకి ఇచ్చింది ఎంత? ఆ… ఒక్కమాట దానిలో మీ జీతాలు కలుపుకోకుండా చెప్పండి. ఎందుకంటే అది తప్ప మరేమీ ఇవ్వలేదు కనుక!” అని నారా లోకేష్‌ అన్నారు.

“సంపూర్ణమద్య నిషేదం అమలుచేస్తానన్న జగన్‌ రెడ్డి ఈ మూడున్నరేళ్ళుగా ఏం చేస్తున్నారో మీరే చెప్పండి తమ్ముళ్ళూ… రాష్ట్ర వ్యాప్తంగా తనవాళ్ల చేతే మద్యం షాపులని పెట్టించి కల్తీ మద్యం అమ్మిస్తున్నాడు. పొలంలో పురుగుల మందులు జల్లితే పురుగులు చస్తాయో లేదో తెలీదు కానీ ఈ కల్తీ మద్యం జల్లితే ఖచ్చితంగా పురుగులన్నీ చస్తాయి,” అని నారా లోకేష్‌ అన్నారు.

“ఊరికే బాబు గురించి చెడుగా వాగితే ఎవరు వింటారయ్యా నీ మాటలు? ఆయన నీకంటే చాలా తెలివైనవాడు… అన్నిటి గురించి మంచి అవగాహన ఉన్నవారు ఆయన. బాబు అంటే బ్రాండ్… సిఎం జగన్‌ అంటే జైలు!బాబుగారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు నువ్వు అమూల్ పాలు తాగుతున్నావు. అమూల్ బేబీవి నువ్వు. చంద్రబాబు నాయుడు వయసు గురించి పదేపదే మాట్లాడుతున్నావు కదా ఆయన నడిచినంత వేగంగా నువ్వు నడవగలవా?” అని నారా లోకేష్‌ అన్నారు.

“మన జగనన్న ఎప్పుడైనా మీ ఊరికి వస్తుంటే రోడ్డుకి ఇరువైపులా పరదాలు కట్టిస్తారు. ఆయన వచ్చిన తర్వాత రాష్ట్రంలో పరదాల సేల్స్ బాగా పెరిగాయి. ఆయన పెద్ద బుల్లెట్ ప్రూఫ్ బస్ వేసుకొని వచ్చి ఆ పరదాలకే ఇట్టిట్టిట్టా… దండాలు పెడుతూ వెళ్లిపోతారు. అసలు ఆయన పరదాలు ఎందుకు కట్టిస్తారో మీకెవరికైనా తెలుసా?ఇదివరకు పాదయాత్ర చేసినప్పుడు ప్రజలకి హామీలు ఇచ్చుకొంటూపోయాడు. ఇప్పుడు కనబడితే ప్రజలు వాటి గురించి నిలదీస్తారనే భయంతో! పరదాలు లేకుండా ఆయన ఎప్పుడైనా పర్యటనలు చేయడం మీరెవరైనా చూశారా?” అంటూ నారా లోకేష్‌ వరుసగా చురకలు, చలోక్తులు వేస్తూ ప్రజలని ఆకట్టుకొంటూ ముందుకు సాగిపోతున్నారు.