Lokesh should follow the father success formula in difficult timesతెలుగుదేశం పార్టీ మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలను బహిష్కరించడంతో పార్టీ శ్రేణులు పూర్తి స్థాయి నైరాశ్యంలో ఉన్నాయి. అయితే తిరుపతి ఉపఎన్నికలు సమీపిస్తుండడంతో అక్కడి శ్రేణులను ఉత్సాహపరిచే బాధ్యత టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీసుకున్నారు. కొంత కాలంగా అక్కడే మకాం వేసి పార్టీ అభ్యర్ధికి ప్రచారం చేస్తున్నారు.

హంగు ఆర్భాటం లేకుండా..చాప కింద నీరులా అందర్నీ కలుపుకుంటూ ముందుకు కదులుతున్నారు. పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉండగా… తిరుపతి వంటి చోట గెలవడం అతికష్టమని తెలిసినా లోకేష్ ఆ బాధ్యత తీసుకోవడం గమనార్హం. “మంచి నాయకుడి లక్షణం అది. చంద్రబాబు టీడీపీలో చేరిన కొత్తలో ఆయన కూడా అలానే కష్టపడే వారు,” అని టీడీపీ పాత తరం నాయకులు గుర్తు చేసుకుంటున్నారు.

“ప్రతి ఊరిలో లోకేష్ పేరెత్తి పిలిచేవాడు ఉండేలా కష్టపడాలి. ప్రతి చోటా ప్రాణం పోయినా ఆయన ముందు అబద్ధం చెప్పని మనిషి ఒకడు ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. అటువంటి వారిని గుర్తించి రెగ్యులర్ గా టచ్ లో ఉండాలి. చంద్రబాబు సక్సెస్ సీక్రెట్ అదే. లోకేష్ చెయ్యాల్సింది కూడా అదే,” అని వారు సలహా ఇస్తున్నారు.

“టీడీపీ ఇబ్బందిలో ఉన్న మాట వాస్తవమే. అయితే ఇటువంటివి టీడీపీకి కొత్తేమి కాదు. అటువంటి ఇబ్బంది వచ్చినప్పుడల్లా పార్టీ మరింత బలంగా పైకి లేచింది. అటువంటి సందర్భంలోనే నాయకులు పుడతారు. ప్రతీ సమస్యలోను నాన్న అయితే ఏం చేసేవాడో అలోచించి ముందుకు వెళ్తే మంచి నాయకుడిగా పరిణితి చెందడం కష్టమేమీ కాదు,” అని వారు అభిప్రాయపడుతున్నారు.