Nara Lokesh Shake hands with Alla Rama Krishna Reddy-ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ లాబీల్లో ఈరోజు ఉదయం ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి ఇటీవలే ఎన్నికల్లో పోటీచేసిన రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు… నారా లోకేష్, ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎదురుపడి కరచాలనం చేసుకున్నారు. ఎమ్మెల్సీ లోకేశ్‌ టీడీఎల్పీ కార్యాలయం వైపు వెళ్తుండగా .. ఎదురుపడిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని పలకరించారు. ఇరువురూ నమస్కరించుకున్నారు. ఈ సందర్భంగా లోకేష్ కు ఆళ్ల రామకృష్ణారెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి లోకేష్ పై ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలుపొంది జైంట్ కిల్లర్ గా అవతరించారు. ఎన్నికల ముందు మంగళగిరిలో వైకాపా అభ్యర్ది ఆళ్ల రామకృష్ణారెడ్డిని గెలిపిస్తే ఆయన కు నా మంత్రి వర్గంలో స్థానం కల్పిస్తా అని జగన్ ప్రకటించారు అయితే ఆ తరువాతి పరిణామాలలో ఆయనకు చోటు ఇవ్వడం కుదరలేదు. అయితే ఆయనకు రెండున్నర ఏళ్ళ తరువాత జరిగే మంత్రివర్గ విస్తరణలో ఆయనకు చోటు ఖాయమని జగన్ చెప్పినట్టు సమాచారం.

మరోవైపు ఆళ్లకు రాజధాని నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న సీఆర్డీఏ చైర్మన్ పదవిని జగన్ కట్టబెడతారని పుకార్లు వచ్చాయి. ఈరోజు మీడియాతో ముచ్చటించిన ఆర్కే అసలు ఆ పోస్ట్ తనకు ఇస్తున్నారన్న విషయం ఇంతవరకూ తన దృష్టికి రాలేదన్నారు. ఆ పోస్ట్ తనకిస్తున్నట్లు వచ్చిన వార్తలన్నీ పుకార్లేనని ఆర్కే కొట్టిపారేశారు. ఫైనల్‌గా లోకేష్ ను ఓడించిన ఆళ్ల రామకృష్ణారెడ్డికు.. జగన్ ఏ కీలక పదవి ఇస్తారో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.