nara-lokesh-satire-on-ys-jagan-davos-tripసిఎం జగన్మోహన్ రెడ్డి మంత్రులు, అధికారుల బృందంతో కలిసి శుక్రవారం ప్రత్యేక విమానంలో దావోస్ ప్రపంచ ఆర్ధిక సదస్సుకు బయలుదేరడంపై తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ ట్విట్టర్‌లో స్పందిస్తూ, “ మా నాన్నని ద్వేషించేవారు,విమర్శించేవారు సైతం ఆఖరికి ఆయన మార్గంలో నడవాల్సిందే. సంక్షేమం నుంచి ఐ‌టి వరకు.. అమరావతి నుండి విదేశాలకు వెళ్ళి పెట్టుబడులు ఆకర్షించడం వరకూ చంద్రన్న మార్గమే రాజమార్గం.”

“దావోస్ ఎందుకు డబ్బులు దండుగ అన్న జగన్ రెడ్డి ఇప్పుడు ఏకంగా స్పెషల్ ఫ్లైట్‌లో దావోస్ పర్యటనకు వెళ్లాల్సి వచ్చింది. బహుశః దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదేనేమో,”

“చంద్రబాబు అధికారులను వెంట తీసుకువెళ్ళేవారు. అక్కడికక్కడే అనుమతులు ఇచ్చేవారు. కానీ జగన్ వెంట భారతిగారిని ఏ హోదాలో తీసుకువెళ్ళారు? లేకపోతే ఇది విహారయాత్ర?” అంటూ వరుస ట్వీట్స్ సంధించి సిఎం జగన్మోహన్ రెడ్డిని నిలదీశారు.

నారా లోకేష్‌ చెప్పినట్లు ఇది ఖచ్చితంగా దేవుడి స్క్రిప్ట్ అనే భావించాల్సి ఉంటుంది. ఆనాడు చంద్రబాబు నాయుడు, అధికారులతో కలిసి దావోస్ వెళ్ళినప్పుడు, “అక్కడ డబ్బు చెల్లించి ఎవరైనా టెంట్ వేసుకొని కూర్చోవచ్చు. చంద్రబాబు నాయుడు కూడా అదే చేసి అక్కడికి వచ్చిపోయే విదేశీ ప్రతినిధులతో ఫోటోలు తీయించుకొంటూ వాటిని ఇక్కడ పత్రికలలో వచ్చేలా చేసుకొని ప్రచారం చేసుకొంటున్నారు. దావోస్ పర్యటనలతో రాష్ట్రానికి నష్టమే తప్ప ఎటువంటి లాభం ఉండదు,” అంటూ తీవ్ర విమర్శలు చేశారు.

అప్పటికి జగన్మోహన్ రెడ్డికి తాను భవిష్యత్‌లో రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అవుతాననే నమ్మకం, ఆలోచనలేకపోవడం వలననే ఆవిదంగా మాట్లాడి ఉండవచ్చు. కానీ ఆనాడు ‘దావోస్ వెళ్ళడం డబ్బు దండగ’ అని చెప్పిన జగన్ ఇప్పుడు అక్కడికే బయలుదేరడం ఖచ్చితంగా దేవుడి స్క్రిప్ట్ గానే భావించాల్సి ఉంటుంది.

మరోవిషయం ఏమిటంటే, ఆనాడు చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీని ఏర్పాటు చేసి, హైదరాబాద్‌ను అభివృద్ధి చేసినందున విదేశీ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులలో సైతం ఆయన పట్ల ఓ నమ్మకం, ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కానీ కేవలం మూడేళ్ళలో ఏపీని 20 ఏళ్ళు వెనక్కు నడిపించిన సిఎం జగన్మోహన్ రెడ్డిని వారు ఎందుకు నమ్ముతారు?నమ్మి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సాహసిస్తారా? త్వరలోనే సమాధానం లభిస్తుంది.

చంద్రబాబు నాయుడు చాలా దూరదృష్టితో ఆలోచించి అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తే దానినీ తీవ్రంగా వ్యతిరేకించిన సిఎం జగన్మోహన్ రెడ్డి, చివరికి అక్కడే రాజధాని నిర్మాణ పనులు చేపట్టవలసి వచ్చింది. కనుక నారా లోకేష్‌ చెప్పినట్లుగా, చంద్రబాబు నాయుడుని ద్వేషించేవారు, విమర్శించేవారు సైతం ఆఖరికి ఆయన మార్గంలో నడవాల్సిందే. సంక్షేమం నుంచి ఐ‌టి వరకు..అమరావతి నుండి విదేశీ పెట్టుబడులు ఆకర్షించడం వరకూ…అన్నిటికీ చంద్రన్న మార్గమే రాజమార్గం… అని జరుగుతున్న ఈ పరిణామాలే చెపుతున్నాయి.