Nara Lokesh satire on YS jagan and Vijaya Sai Reddyమాజీ మంత్రి, చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ ట్విట్టర్ వేదికగా ప్రభుత్వం మీద విమర్శలు సంధిస్తున్నారు. నిన్న మీ బాబు వల్లే కాలేదు మా బాబుని ఇరుకున పెట్టడం అంటూ ముఖ్యమంత్రి జగన్ ను సవాలు చేసిన లోకేష్ ఈ రోజు తన విమర్శలకు మరింత పదును పెట్టారు. ఈరోజు జగన్ తో పాటు ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డిని కూడా టార్గెట్ చేశారు లోకేష్. ఇదే సమయంలో విద్యుత్ కొనుగోళ్లలో 2,636 కోట్లు అవినీతి జరిగినదంటూ జగన్ చేసిన విమర్శలకు కూడా లోకేష్ సమాధానం చెప్పారు.

“నిజాయితీకే సిగ్గుచేటు అన్నవిధంగా.. అక్ర‌మాస్తుల కేసులో ఏ1 గారు అవినీతిపై క‌మిటీ వేశారు. ఏ2 @VSReddy_MP గారు విచార‌ణ చేస్తార‌ట‌! క‌లికాలం కాక‌పోతే అక్ర‌మాల విక్ర‌మార్కులు నీతి నిజాయితీ గురించి మాట్లాడటమా!! వైఎస్ గారి హ‌యాంలో సోలార్ విద్యుత్‌ యూనిట్ రూ.14కి కొంటే, టీడీపీ హ‌యాంలో రూ. 2.70 యూనిట్ కొన్నారు. మీ నాయ‌న‌గారి నిర్వాకంతో డిస్కంల‌కు రూ. 8 వేల‌కోట్లు న‌ష్టం వ‌చ్చింది. ఈ ఉదాహరణలు చాలవా, ఎవ‌రు మ‌హామేతో! ఎవ‌రు దార్శ‌నిక నేతో తెలుసుకోడానికి. అన్న‌య్య‌లూ నాకేం తెలియ‌దంటూనే ఎలాంటి విచారణ జరగకుండా, కనీస ఆధారాలు లేకుండా 2,636 కోట్లు అవినీతి జ‌రిగింద‌ని తేల్చారు. గుడ్డ కాల్చి వెయ్యడంలో మీకు మీరే సాటి @ysjagan గారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చేనాటికి 22 మిలియన్ యూనిట్ల లోటు విద్యుత్తు నుండి మిగులు విద్యుత్తు సాధించి 5 ఏళ్లలో 150కి పైగా అవార్డులు సాధించడం మా ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. విద్యుత్ ఉత్పత్తిలో ఏపీని దేశానికే ఆదర్శంగా నిలిపాం. గడిచిన 5 ఏళ్లలో రూ. 36 వేల కోట్ల పెట్టుబడి,13 వేల మందికి పైగా ఉద్యోగాలు లభించాయి. విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు అంటూ పెట్టుబడులు అడ్డుకొని రాష్ట్రానికి చెడ్డ పేరు తీసుకురావొద్దని స్వయంగా కేంద్ర ఇంధనశాఖ కార్యదర్శి ఆనంద్ కుమార్ మీకు లేఖ రాసిన విషయం మర్చిపోయారా? నీతి, నిజాయితీ పునాదిగా ఎదిగిన మా అధినేత @ncbn గారి పై అవినీతి ముద్ర వెయ్యాలి అనుకుంటున్న మీ ప్రయత్నం విఫలయత్నంగానే మిగిలిపోతుంది,” అని లోకేష్ ట్వీట్ చేశారు.

ఓటమి తరువాత మొత్తానికి నిద్రావస్థలో ఉన్న పార్టీ తరపున లోకేష్ బలంగా వాదనలు వినిపించడం టీడీపీ క్యాడర్ కు ఊరటనిచ్చింది.