Nara Lokesh responds on allegations on balakrishnaఅమరావతిలో తెలుగుదేశం నేతలు ఇన్సైడర్ ట్రేడింగుకు పాల్పడి కోట్లు వెనకేశారని జగన్ ప్రభుత్వం పదే పదే ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అందుకనే అమరావతి పనులు నిలిపివేశాం అని చెబుతున్నారు. ఈ క్రమంలో ఈరోజు ఒక ఆంగ్ల పత్రికలో బాలయ్య, కొందరు బంధువులతో కలిసి 500 ఎకరాలు కొన్నారని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ ఒక కథనం ఇచ్చింది. అయితే దీనిపై టీడీపీ జాతీయ కార్యదర్శి, బాలయ్య అల్లుడు నారా లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

“వైకాపా నాయకులు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నాం అనుకుంటున్నారు. వాళ్ళ ఫేక్ బతుకు మారలేదు. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అసత్యాలతో కాలం నెట్టుకొస్తున్నారు. ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని దెబ్బతియ్యడానికి ఇన్ సైడ్ ట్రేడింగ్ అంటూ బురద జల్లుతున్నారు. తండ్రి అధికారాన్నీ, శవాన్నిపెట్టుబడిగా పెట్టి ఎదిగిన చరిత్ర మీ నాయకుడిది. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నా.. ఏ రోజూ అటు వైపు కూడా చూడకుండా స్వఛ్చమైన మనస్సు, నీతి, నిజాయితీతో ఎదిగారు మా బాలా మావయ్య,” అంటూ విరుచుకుపడ్డారు లోకేష్.

“అటువంటి వ్యక్తి రాజధానిలో భూములు కొన్నారని ఆరోపణలు కాదు, దమ్ముంటే నిరూపించండి. లేక రాజధాని రైతులకు, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పండి,” అని కూడా లోకేష్ డిమాండ్ చేశారు. ఇది ఇలా ఉండగా బాలయ్య కొన్న ఈ భూమి వల్లే ప్రపంచ బ్యాంకు రాజధానికి అప్పు ఇవ్వలేదని సోషల్ మీడియాలో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఆరోపించడం మరో కొసమెరుపు. మరోవైపు అమరావతి మార్పు తథ్యం అనే పుకార్లు షికారు చేస్తుంది. దీనితో దొనకొండలో భూముల రేట్లు పెరుగుతున్నాయి.