Nara Lokesh reacts on Opposition comments ఇప్పటివరకు దాదాపుగా వెయ్యికి పైగా ప్రసంగాలు ఇచ్చాను, అందులో ఒకటి, రెండు సందర్భాలలో తప్పులు దొర్లిన మాట వాస్తవమే. ఆ మాటకొస్తే నేనే కాదు, ప్రతిపక్ష నేత మాటల్లో కూడా తప్పులు దొర్లిన సందర్భాలున్నాయి, అవన్నీ మేం హైలైట్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే రాజకీయాలు దాని కోసం కాదు, ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం పాటు పడుతున్నాం… వాళ్ళు చేసే ప్రచారాన్ని చేసుకోనివ్వండి… తాను చేస్తున్న కార్యక్రమాలు ఏమిటో పార్టీ కార్యకర్తలకు, నేతలకు తెలుసు… అలాగే ప్రజలు కూడా అర్ధం చేసుకుంటున్నారు… అంటూ తన నాయకత్వ లక్షణాలపై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తపరిచారు.

100 రోజులు మంత్రిగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో భాగంగా నారా లోకేష్ వ్యక్తపరిచిన భావాలు ఇవి. ఈ సందర్భంగా… ‘ప్రతిపక్ష పార్టీ ఆంధ్రా పప్పు అంటే నారా లోకేష్ అన్న ప్రచారాన్ని సోషల్ మీడియాలో బాగా పెద్ద ఎత్తున చేపడుతున్నారన్న’ ప్రశ్న సంధించగా, దానికి ధీటుగా బదులిచ్చారు లోకేష్. ఎవరూ కలలో కూడా సాధ్యం కాని విధంగా గ్రామీణ ప్రాంతాలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టంకు రూపకల్పన చేసాం, రికార్డు స్థాయిలో పార్టీ సభ్యులుగా చేర్చిన ఘనత నాది, అలాగే దాదాపుగా రెండు వేల కార్యకర్తల కుటుంబాలకు ఆర్ధిక సాయం అందించగలిగాను, 40 లక్షల వీధి దీపాలు… ఇవన్నీ పప్పోడు చేయగలిగితే పప్పు… ఉప్పోడు చేయగలిగితే ఉప్పోడు… అంతే… దానికి నేనేం చేయగలుగుతాను అన్న లోకేష్, ఓ లాజిక్ కూడా చెప్పారు.

ఓ పక్కన ‘ఆంధ్రా పప్పు’ అంటారు, మరో పక్కన ‘అవినీతి పరుడు’ అంటున్నారు. నిజంగా ‘పప్పు’ అయితే ‘అవినీతి’ చేయగలుగుతాడా? కేవలం అవగాహన లేకుండా పప్పు, అవినీతి పరుడు అంటూ ఆరోపణలు చేయడం తప్ప వారికేం తెలియదంటూ… ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలను లైట్ గా తీసుకున్నారు. సోషల్ మీడియాలో ఓ పది మంది చేసే పనులకు తాను నిరుత్సాహపడేది లేదని, ఆ పది మంది కోసం తాను కష్టపడడం లేదని, 4.50 కోట్ల ప్రజల కోసం తాను కృషి చేస్తున్నానని స్పష్టత ఇచ్చారు లోకేష్. ప్రతిపక్షాలు చెప్తున్నట్లు నిజంగా లోకేష్ పప్పు అయితే… అస్సలు ఈ లాజిక్ వ్యాఖ్యలే తట్టకూడదు కదా! నిజమే… మరి..!