Nara Lokesh reacted chaning name of NTR Health Universityఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడంపై టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ తీవ్రంగా స్పందిస్తూ, “మన పొరుగు రాష్ట్రం తమిళనాడులో అన్నాడీఎంకె హయంలో అమ్మా క్యాంటీన్‌లు ఏర్పాటుచేస్తే, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన స్టాలిన్ (డీఎంకె) ప్రభుత్వం వాటిని యధాతధంగా కొనసాగిస్తోందే తప్ప మార్చలేదు.

అదేవిదంగా కాంగ్రెస్‌ హయాంలో ఢిల్లీ, హైదరాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయాలకు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ పేర్లు పెట్టారు. తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్రమోడీ వాటిని మార్చలేదు. నేటికీ అవే పేర్లు కొనసాగుతున్నాయి. అంటే ప్రభుత్వాలు మారినా పేర్లు, పధకాలు మారకుండా యధాతధంగా కొనసాగుతున్నాయి.

కానీ మన ఏపీలో ఈ సైకో ముఖ్యమంత్రి… రివర్స్ రెడ్డి… రివర్స్ పరిపాలన చేస్తూ ఇటువంటి తుగ్లక్ పనులు చేస్తున్నాడు. ఇప్పుడు ప్రభుత్వాలు మారినప్పుడల్లా పేర్లు మార్చేమాటయితే రేపు మేము అధికారంలోకి వచ్చినప్పుడు మేము కూడా పేర్లు మార్చితే ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకోండి. రేపు రాష్ట్రాల పేర్లు కూడా మార్చుకొంటూ పోతే చివరికి ఏమవుతుందో ఆలోచించండి.

నిన్న విధానసభలో టిడిపి, బిజెపి, వామపక్షాలు అన్నీ ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ఛైర్మన్‌గారు 9 నిమిషాలలో యూనివర్సిటీ పేరు మార్పు ప్రతిపాదనను ఒకే చేయించేశారు. రాష్ట్రంలో అనేక సమస్యలు పేరుకు పోయి ఉన్నాయి. కనుక కనీసం 15 రోజులు సమావేశాలు నిర్ణయించి సమస్యలపై చర్చిదామని మేమందరం పదేపదే కోరినా కేవలం 5 రోజులే సభలు పెట్టి వాటిలో కూడా ఇటువంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకొని సభలో ప్రతిపక్షాలను మాట్లాడనీయకుండా మా గొంతులు నొక్కి మమ అనిపించేశారు.

ప్రజా సమస్యలపై చర్చించడానికి ఈ ప్రభుత్వానికి ఆసక్తి లేదు. శాసనసభ, మండలి సమావేశాలను కూడా తమ రాజకీయ కక్షలకు ఉపయోగించుకొంటూ అధికారాన్ని దుర్వినివియోగం చేస్తున్నారు. ఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చాలనే జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము,” అని అన్నారు.