Nara-Lokesh-Rayalaseema-Declaration“మేము అనేక సంక్షేమ పధకాలు అమలుచేస్తున్నాము. మీరు వాటిని కొనసాగిస్తారా… రద్దు చేస్తారా?” చెప్పండి అంటూ రోజూ టిడిపిని బ్లాక్ మెయిల్ చేస్తున్న వైసీపీ నేతలు, మహానాడులో చంద్రబాబు నాయుడు కొన్ని సంక్షేమ పధకాలు ప్రకటించేసరికి కంగుతిన్నారు. ఎంతగా అంటే వాటిని ఎద్దేవా చేయడమే తప్ప ధీటుగా ఏమీ మాట్లాడలేకపోయారు.

చివరికి నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా వాటి గురించి చర్చించేందుకు ఇష్టపడలేదని సమాచారం. టిడిపి ట్రైలర్‌ చూసి ముందస్తు ఆలోచన కూడా విరమించుకొన్నారు.

ఈ షాక్ నుంచి తేరుకొనేలోగా టిడిపి యువనేత నారా లోకేష్‌ నిన్న కడపలో ప్రకటించిన ‘రాయలసీమ డిక్లరేషన్’ వైసీపీకి మరో పెద్ద షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే, మూడు రాజధానుల పేరుతో సీమజిల్లాల ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టి టిడిపి, జనసేనలను అడుగుపెట్టకుండా చేద్దామనుకొంటే, సీమలోనే నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర ప్రారంభించి, అత్యంత జనాధారణతో విజయవంతంగా పూర్తి చేయబోతున్నారు.

నారా లోకేష్‌ పాదయాత్రతో సీమ జిల్లాలలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి భాగోతాలు, ఇసుక దోపిడీలు, కొండలు, ప్రభుత్వం భూముల కబ్జాలను నారా లోకేష్‌ సెల్ఫీ ఛాలెంజ్‌లతో ఎండగడుతుంటే, కాదని ఎవరూ వాదించలేకపోయారు. మరోపక్క సీమ ప్రజలు వైసీపీ చెప్పిన న్యాయరాజధాని పిట్టకధను పట్టించుకోకుండా నారా లోకేష్‌కు అడుగడుగునా నీరాజనాలు పలకడం వైసీపీ నేతలు ఎసిడిటీని మరింత పెంచింది.

వీటన్నిటికీ కొసమెరుపుల రాయలసీమ డిక్లరేషన్ వైసీపీ నేతల నోట మాట రానీయకుండా చేసింది. సాధారణంగా అక్కడ తమ ప్రత్యర్ధులు మాట్లాడుతుండగానే సోషల్ మీడియాలో టకటకా కౌంటర్లు వేసే అంబటి రాంబాబు ఇంతవరకు రాయలసీమ డిక్లరేషన్ గురించి ఒక్క బాణం కూడా వేయలేదు. బహుశః సీమలో సాగునీటి ప్రాజెక్టుల గురించి నారా లోకేష్‌ చెపుతుంటే వినడమే కానీ మన సంబరాల రాంబాబుకి తెలిసి ఉండకపోవచ్చు!

త్రాగు, సాగు నీటి కోసం సీమ ప్రజలు అనుభవిస్తున్న కష్టాలను నారా లోకేష్‌ వివరించి, “వాటన్నిటినీ పరిష్కరించే బాధ్యత నేనే తీసుకొంటాను. లేకపోతే మళ్ళీ ఎదురైనప్పుడు నన్ను నిలదీసి అడగండి…” అని చెప్పడంలోనే పరిష్కరించాలనే తపన, పరిష్కరించగలననే నమ్మకం నారా లోకేష్‌ వ్యక్త పరిచారు.

సీమ ప్రజలు కూడా నారా లోకేష్‌లో నిజాయితీ, చిత్తశుద్ధి, తపనను గుర్తించిన్నట్లే ఉన్నారు. సీమకు నీళ్ళు అందించి, వ్యవసాయానికి సాయం అందించి, పరిశ్రలను రప్పించి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తానని ఓ సమగ్ర ప్రణాళికను నారా లోకేష్‌ ప్రజల ముందు, టీవీల ముందు కూర్చొని జాగ్రత్తగా ఆలకిస్తున్న వైసీపీ నాయకుల ముందు పెట్టారు. ప్రజలు వెంటనే స్పందిస్తున్నారు. వైసీపీ నేతలు కూడా స్పందిస్తారు బహుశః ఈ షాక్ నుంచి తేరుకొన్నాక!

నిజానికి నారా లోకేష్‌ చెప్పిన ఈ సమస్యలన్నీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలకు తెలియనివి కావు. కానీ వారి అధినేత జగనన్న సంక్షేమ పధకాల నావలో ఎన్నికల వైతరిణిని దాటేయాలనుకోవడం వలననే వారందరి చేతులు కట్టేసిన్నట్లయింది. శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి అది చెప్పారుగా?

అదే… ఈ సమస్యల పరిష్కరించాలని వైసీపీ ప్రభుత్వం పూనుకొంటే నాలుగేళ్ళు సరిపోవా? పరిష్కరించి ఉండి ఉంటే నేడు నారా లోకేష్‌ సీమలో పాదయాత్ర చేయగలిగేవారా? చేసినా ప్రజలు పట్టించుకొనేవారా?ఎంతసేపు ప్రజల చేతిలో నాలుగు కాసులు పెట్టి ప్రసన్నం చేసుకోవాలనే తపన, లేకుంటే టిడిపిని రాజకీయంగా దెబ్బతీసి ప్రత్యామ్నాయం లేకుండా చేసుకొని గెలవాలనే ఆలోచనే తప్ప, ప్రజల సమస్యలు, కష్టాలు తీర్చాలని ఏనాడూ ఆలోచించకపోవడం వలననే నేడు ‘రాయలసీమ డిక్లరేషన్’ వచ్చింది. అదే వైసీపీ పాలిట శాపంగా మారినా ఆశ్చర్యం లేదు.

రాయలసీమ డిక్లరేషన్ ఉన్నప్పుడు, రేపు అమరావతి డిక్లరేషన్, ఉత్తరాంద్ర డిక్లరేషన్లు కూడా ఉండొచ్చు కదా? అంటే చూడాల్సిన సినిమా ఇంకా చాలానే ఉందన్న మాట!

వివేకా హత్య కేసుతో హైకోర్టు, సుప్రీంకోర్టు, సీబీఐలతో చెడుగుడు ఆడుకోవచ్చేమో కానీ ప్రజలతో, వారి కోసం పోరాడుతున్న టిడిపితో, నారా లోకేష్‌తో సాధ్యం కాకపోవచ్చు. ఒక్క ఛాన్స్ ఒక్కసారే లభిస్తుంది ప్రతీసారి లభించదు కదా?