Nara Lokesh Questions YSRCPటిడిపి యువనేత నారా లోకేష్‌ శనివారం కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో 115వ రోజు యువగళం పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా చియ్యపాడు గ్రామంలో బీసీ, ఎస్సీ వర్గాల ప్రజలతో మాట్లాడుతూ, “వైసీపీ నేతలు కబ్జాలు చేసిన మీ భూములను మేము అధికారంలోకి రాగానే తిరిగి ఇప్పిస్తాం. నేను నా పాదయాత్రలో ఎక్కడ చూసినా ఇటువంటి అరాచకాల గురించే వింటున్నాను. మీ భూములే కాదు ప్రాణాలు కూడా హరించివేస్తూనే మళ్ళీ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు తానే గొప్ప న్యాయం చేస్తున్నానంటూ జగన్‌ గొప్పలు చెప్పుకొంటున్నారు.

అంతటితో ఆగకుండా టిడిపి కామందుల పార్టీ అని, బీసీలకు వ్యతిరేకమని దుష్ప్రచారం చేయిస్తున్నారు. అయితే ఆనాడు బీసీ వర్గానికి చెందిన సుబ్బయ్యను హత్య చేసింది ఎవరు? ఆయనను నడిరోడ్డుపై అతికిరాతకంగా హత్య చేసినప్పుడు, జిల్లాలోని బీసీ సంఘాలు ఎందుకు నోరు విప్పలేదు? అప్పుడేమైపోయాయి ఈ బీసీ సంఘాలన్నీ?

సుబ్బయ్య హత్య జరిగినప్పుడు నేను వెంటనే ఇక్కడకు వచ్చి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేసే వరకు పోరాడాను. ఇప్పుడు మా పార్టీని విమర్శిస్తున్నవారెవరైనా అప్పుడు ముందుకు వచ్చారా?సుబ్బయ్య హత్యతో రోడ్డున పడ్డ ఆయన కుటుంబాన్ని ఆడుకోవడానికి ఎవరైనా ముందుకు వచ్చారా? ఆయన ఇద్దరు పిల్లలని టిడిపియే చదివిస్తోందని మీ అందరికీ తెలుసు కదా?

కనుక మేము బీసీలకు వ్యతిరేకమనే వైసీపీ దుష్ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. టిడిపి ఆవిర్భవించిందే బడుగు బలహీనవర్గాల ప్రజల కోసం. అటువంటిది బీసీలకు ద్రోహం చేస్తుందని ఎలా అనుకొన్నారు?ఇప్పుడే మీ అందరికీ టిడిపి తరపున హామీ ఇస్తున్నాను. ఉమ్మడి కడప జిల్లా నుంచి ఈసారి బీసీ అభ్యర్ధికే టికెట్‌ ఇస్తాము,” అని నారా లోకేష్‌ అన్నారు.

వైసీపీ బీసీలకు ప్రాధాన్యం ఇస్తోందని గొప్పగా చెప్పుకొంటారు కానీ ఆ పార్టీలోనే కాదు… ప్రభుత్వంలో వివిద శాఖలలో, చివరికి పోలీస్ శాఖలో కూడా రెడ్డి సామాజిక వర్గానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని అందరికీ తెలుసు. పార్టీలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ నేతలు వారి ముందు గట్టిగా మాట్లాడలేని పరిస్థితి గురించి బయటవారికంటే లోపాలున్నవారికే బాగా తెలుసు.

కానీ టిడిపిలో మొదటి నుంచి బీసీలకు, మిగిలిన వర్గాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. రెండు పార్టీల నేతల జాబితాలు బయటకు తీస్తే ఈ విషయం బయటపడుతుంది. అదే నారా లోకేష్‌ నేడు మరోసారి నొక్కి చెప్పారనుకోవచ్చు.